పోస్టల్ ఖాతాల్లో సొమ్ము లూటీ

ధనవంతుల దగ్గర నుంచి పేదల వరకు డబ్బులు తమదైన శైలిలో పొదుపు చేస్తుంటారు. పేదవారి కోసం అతి తక్కువ ధరకే ఆదా విషయానికొస్తే మొదట గుర్తొచ్చేది పోస్టాఫీసు

  • Publish Date - December 20, 2023 / 05:52 PM IST

– రూ.15 లక్షలు స్వాహా చేసిన

 సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ 

– నందికొండ పోస్టాఫీసులో ఆలస్యంగా వెలుగులోకి..

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ధనవంతుల దగ్గర నుంచి పేదల వరకు డబ్బులు తమదైన శైలిలో పొదుపు చేస్తుంటారు. పేదవారి కోసం అతి తక్కువ ధరకే ఆదా విషయానికొస్తే మొదట గుర్తొచ్చేది పోస్టాఫీసు. పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేస్తే సొమ్ము భద్రమని అంతా భావిస్తుంటారు. నగదుకు సరైన వడ్డీ, దాచిన డబ్బుకు భద్రత ఉంటుందనే నమ్మకంతో ప్రతినెలా కొద్ది మొత్తంలో కూడబెడతుంటారు.

ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో దాచిన సొమ్ముకు భద్రత కరువైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందనేది నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో స్వాహాపర్వం తేటతెల్లం చేస్తోంది. సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ చేసిన పనికి ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తాము కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఖాతాల్లో పూర్తిగా లేకపోవటంతో గుండెలు బాదుకుంటున్నారు. బ్రాంచ్ సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ ఖాతాదారుల డిపాజిట్ సొమ్మును దారి మళ్లించడంతో ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా డిప్యూటేషన్ పై వచ్చిన సబ్ పోస్ట్ మాస్టర్ మునగాల రంగయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు తమ అధికారులు కొందరి ఖాతాలను పరిశీలిస్తే, నగదు నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఖాతాదారుల పాస్ బుక్ లలో మొత్తాలకూ, పోస్టాఫీస్ రికార్డుల్లో నగదు నిల్వలకు తేడాలను తనిఖీ అధికారి గుర్తించడం జరిగిందన్నారు. ఆ తేడా నగదు మొత్తం రూ.15 లక్షల వరకు ఉందని పేర్కొన్నారు.

మొత్తం ఖాతాదారుల ఖాతాలను పరిశీలిస్తే గానీ ఎంత మొత్తం స్వాహా అయ్యిందో తేలని పరిస్థితి. ఓ ఖాతాదారుడు తన పొదుపు సొమ్మును తీసుకుందామని పోస్ట్ఆఫీస్ కు వెళ్తే.. సబ్ పోస్టు మాస్టర్ రామకృష్ణ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇలా ‘కంచే చేను మేస్తే’ నగదుకు రక్షణ ఎవరు కల్పిస్తారు? ఎవరిని నమ్మాలి? అని ఖాతాదారులు మొరపెట్టుకుంటున్నారు.

ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఖాతాలలో మాయమైన డబ్బులను వెంటనే తిరిగి ఇచ్చేవిధంగా చూడాలని ఖాతాదారులు కోరుతున్నారు.