పాట్నా : ఓ యువకుడిని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. తనకు ఇచ్చే రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతడిని కత్తితో పొడిచి చంపారు. అంతటితో ఆగకుండా కళ్లను పీకేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని బరా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బరాలోని బసంత్‌పూర్ గ్రామానికి చెందిన మోహన్ సింగ్ రోజువారి కూలీ. అయితే స్థానికంగా ఉన్న ఓ కాంట్రాక్టర్‌తో పని చేశాడు. ఆ కాంట్రాక్టర్ మోహన్ సింగ్‌కు రూ. 500 చెల్లించాలి. ఆ డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను సింగ్ డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో మోహన్‌పై కాంట్రాక్టర్‌తో పాటు అతని స్నేహితులు కక్ష పెంచుకున్నారు. దీంతో పార్టీ చేసుకుందామని మోహన్ సింగ్‌ను బయటకు పిలిపించారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మోహన్‌ను కత్తితో పొడిచి చంపారు. అతని కళ్లను కూడా పీకేసి, మృగాల్లా ప్రవర్తించారు. అనంతరం మృతదేహాన్ని పంట పొలాల్లోనే వదిలేసి వెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటానస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఆరా సదర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.