విధాత: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. అశ్లీల వీడియోలు చూసిన ఓ 19 ఏండ్ల యువకుడు సొంత చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల మూడో తేదీ రాత్రి సంజూ అనే యువకుడు తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు వీక్షించి, ఆపై తన మైనర్ సోదరిపై లైంగికదాడి చేశాడు. తన అకృత్యాలను కుటుంబసభ్యులకు చెప్తుందనే భయంతో చెల్లి గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలిక మేనమామ నిందితుడైన తన మేనల్లుడు సంజూ కుమార్‌పై ఈనెల 4న ఫిర్యాదు చేసినట్టు పాటియాలీ కొత్వాలి ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ గోవింద్ బల్లభ్ శర్మ తెలిపారు. ఘటన తర్వాత ఇంటి నుంచి పారిపోయిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలించి సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. తన తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడని, తల్లి, సోదరితో కలిసి గ్రామంలోని మరో ఇంట్లో ఉంటున్నానని నిందితుడు వెల్లడించినట్టు తెలిపారు.
“సంఘటన జరిగిన రోజు సంజూ తల్లి అతని మేనమామ ఇంటికి వెళ్లింది. అతడు తన సోదరితో కలిసి ఇంట్లో ఉన్నాడు. అతను తన మొబైల్‌లో పోర్న్ చూశాడు. ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు” అని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్‌ను, అందులో అతడు చూసిన పోర్న్ క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జైలుకు తరలించారు.