Vasanthotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 22 నుంచి 24 వరకు వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 23న ఉదయం 7.45 గంటలకు రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. స్వర్ణ రథంపై నుంచి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.
వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. భక్తులు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. ఈ ఉత్సవాల కారణంగా 21 నుంచి 24 వరకు కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకారసేవ, 23న తిరుప్పావడ సేవ, 24న లక్ష్మీ పూజ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.