Dalai Lama | టిబెట్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామ అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరుకానున్నారు. ఆయన అయోధ్య పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దలైలామా బీహార్‌లోని బుద్ధగయ నుంచి నేరుగా అయోధ్యక చేరుకోనున్నారు. ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకగా జరుగనున్నది. కార్యక్రమానికి హాజరుకావాలని విశ్వహిందూ పరిషత్ దలైలామాకు ఆహ్వానం అందించింది. దలైలామా జనవరి 14న బీహార్ నుంచి మెక్‌లియోడ్‌గంజ్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంది. ఆయన సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం బోద్‌గయాకు వెళ్లారు. దాదాపు నెల రోజులుగా ఆయన బోద్‌గయాలో ఉంటున్నారు. తాజాగా దలైలామా బుద్ధగయ నుంచి అయోధ్యకు వెళ్లనున్నారు. దలైలామా ఈ నెలాఖరులోగా మెక్‌లియోడ్‌గంజ్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. భారత్‌తో పాటు విదేశాలకు చెందిన పర్యాకుటు, బౌద్ధ గురువులు దలైలామా కోసం పర్యాటక నగరమైన మెక్‌లియోడ్‌గంజ్‌కు వస్తుంటారు. ప్రస్తుతం దలైలామా హిమాచల్‌కు దూరంగా ఉండడంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. దలైలామా కారణంగా, విదేశీ ప్రతినిధులు మెక్‌లియోడ్‌గంజ్‌కు వస్తుంటారు. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ప్రవాస టిబెటన్లు, బౌద్ధ అనుచరులు కూడా దలైలామా బోధనలను వినడానికి ఇక్కడకు వస్తుంటారు.
ఇదిలా ఉండగా.. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో వైపు విశ్వహిందూ పరిషత్, అయోధ్య రామాలయ ట్రస్ట్ ప్రముఖులకు ఆహ్వానాలను పంపుతున్నది. క్రీడలు, సినిమా, రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు ఇప్పటికే అందాయి. అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రారంభోత్సవం జరునున్నది. ఉదయం 12.29 గంటల నుంచి 12.30 గంటల మధ్య శుభహుమూర్తం ఉన్నది. రాంలాలా విగ్రహ ప్రతిష్ఠకు 84 సెకన్ల పాటు శుభ సమయం నిర్ణయించారు. గర్భాలయంలో ఐదేళ్ల బాలుడిగా శ్రీరాముడు దర్శనమివ్వనున్నారు. బాల రాముడి విగ్రహాన్ని కర్నాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. అదే సమయంలో ప్రస్తుతం చిన్న ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పాత విగ్రహంతో పాటు గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ గర్భాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.