Medaram Jatara| కొలువుదీరిన కన్నెపల్లి తల్లి.. జనారణ్యమైన మేడారం

లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ చుట్టూరా పచ్చని అడవితో అలరారే మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర తొలిఘట్టానికి అంకురార్పణ జరిగింది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Medaram Sammakka Saralamma Jatara begins in grand style as lakhs of devotees throng the forest shrine. Massive crowds, tribal rituals, devotional fervor mark the opening day of the world’s biggest tribal festival in Telangana.

Medaram Jatara| మేడారం జనారణ్యంగా మారిపోయింది. జయహో సమ్మక్క, సారలమ్మ అంటూ అశేష భక్తజన సందోహం జయజయ నినాదాలు చేస్తూ ఉద్వేగంతో ఊగిపోతుండగా ఆ ప్రాంతమంతా ఉద్విగ్నవాతావరణం చోటుచేసుకున్నది. భక్తిపారవశ్యంలో మునిగి పూనకాలతో మేడారమంతా జనహోరుతో అధ్యాత్మికతను సంతరించుకుని అక్కడి వాతావరణం పతాకస్థాయికి చేరింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ చుట్టూరా పచ్చని అడవితో అలరారే మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర తొలిఘట్టానికి అంకురార్పణ జరిగింది. సాయంసంధ్యా సమయంలో ఆదివాసీల డోలు చప్పులు, పూనకాలు, నృత్యాల మధ్య పడిగెలను చేతబూని ఎర్రవస్తాు లను చుట్టుకున్న వడ్డెలు భక్త శ్రద్ధలతో సారలమ్మను కన్నెపెల్లి నుంచి తోడ్కొని వచ్చారు. దీనికి ముందుగా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులను తమ వంశస్థులు అంగరంగవైభవంగా గద్దెలపైకి చేర్చారు. దీంతో గద్దెల ప్రాంగణంలో దేవతాగమన వాతవరణంతో హోరెత్తింది. పుసుపూ,కుంకుమ, వడిబియ్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమ ఇష్టదేవాలకు జనం మొక్కులు సమర్పించుకున్నారు.

ములుగు పట్టణంలోని ప్రవేశ ద్వారం గట్టమ్మ నుంచి పస్రా, తాడ్వాయి మార్గాల నుంచి మేడారం గద్దెలు, జంపన్నవాగు, పరిసర ప్రాంతాల వరకు బారులు తీరిన, వాహనాలు, బస్సులు, ప్రైవేటు వాహనాలు, కాలిబాటల్లో తరలివచ్చే పరిసర భక్తులతో రాక దారులన్నీ మేడారం వైపుగా సాగిపోతున్నాయి. అందుబాటులో ఉన్న వాహనాలపై జనం తండోపతండాలుగా తరలిరావడంతో కుగ్రామమైన మేడారం మట్టి నగరంగా రూపుదాల్చుకున్నది. విద్యుత్ దీపాల వెలుగు, విస్తృత ఏర్పాట్ల మధ్య మేడారం వెలుగులీనుతున్నది. జాతర నేపథ్యంలో తీర్చిదిద్దిన నూతన గద్దెల పునరుద్ధరణ, ద్వారాలు, పూలతో అలంకరణ, జనహోరుతో మేడారం, జంపన్నవాగు, చిలుకుల గుట్ట పరిసర ప్రాంతాలు నూతనోత్తేజంతో జిగేల్ మంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ములుగు జిల్లా యంత్రాంగమంతా మోహరించి మేడారం జాతర విజయవంతంలో సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భద్రత, ప్రాథమిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

గద్దెల శుద్ధీకరణ

బుధవారం ఉదయం 11:00 నుండి 12:00 గంటల మధ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్దకు చేరుకుని పుట్టమన్నుతో గద్దెలను అలికి శుద్ధి చేశారు. ఆదివాసీ సంప్రదాయం: గొట్టు గోత్రాల ప్రకారం, ఆదివాసీ సాంప్రదాయ పద్ధతుల్లో పీఠ ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారెలను సమర్పించి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారలమ్మ రాక: సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల సమయంలో కన్నెపల్లి నుంచి హనుమాన్ పడిగె నీడలో సారలమ్మ దేవత బయలుదేరి, రాత్రి 9:00 నుండి 10:00 గంటల మధ్య మేడారం గద్దెలకు చేరుకున్నారు. కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను పూజారులు మేడారం గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టించారు.

జన సంద్రంగా మారిన జంపన్న వాగు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగు లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించడం అనవాయితీ గా వస్తుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో ఇసుకతో వన దేవతల ప్రతిమలు ఏర్పాటు చేసి కొబ్బరి కాయ పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివ సత్తుల పునకాలతో జంపన్న వాగులో “పదివేల దండలే తల్లి అబ్బిస్సా అంటూ సమ్మక్క తల్లికి పబ్బతి పడుతూ పుణ్య స్నానాల ఆచరించి వన దేవతలకు ఓడి బియ్యం బంగారం సమర్పించి తమ మొక్కలను చెల్లించి తమ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇంటి ఇలవేల్పుగా ఆరాధిస్తున్నారు.

గురువారం సమ్మక్కరాక

కళ్యాణ మహోత్సవం: మాఘ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవార్లకు, పగిడిద్ద రాజులకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. చిలుకుల గుట్ట నుంచి సమక్కను తీసుకొచ్చే ఆ సన్నివేశం జాతరకే తలమానికంగా నిలువనున్నది. మేడారానికి వచ్చిన భక్తులంతా ఒకరకమైన ఉద్విగ్నతకు లోనయ్యే ఆ వాతావరణం జాతరను అత్యున్నత శిఖాలకు చేరుస్తోంది. సమ్మక్కను తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. భక్తులందరూ అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని, ప్రభుత్వం మరియు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అన్నారు.

Latest News