విధాత : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉండవచ్చన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమాదంపై ఇప్పటికే ఏఏఐబీ విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలను పరిశీలిస్తుంది. ప్రధానంగా బ్లాక్ బాక్స్, పైలట్ సిగ్నల్స్ పై ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది.
విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో అధికార మహాయూతి కూటమి నుంచి వైదొలిగే ఆలోచన చేస్తున్నారని, అలాగే తిరిగి శరద్ పవార్ ఎన్సీపీ పార్టీతో కలిసే ప్రయత్నాల్లో ఉన్నారని, ఈ క్రమంలో ఆయన విమాన ప్రమాదానికి గురవ్వడం అనుమానాలు రేకెత్తిస్తుందని మమత వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం పైనే తమకు నమ్మకం ఉందన్నారు. మరే ఇతర దర్యాప్తు సంస్థల పైనా తమకు విశ్వాసం లేదని.. అవి వాటి స్వేచ్ఛను కోల్పోయాయని ఆరోపించారు. అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు ప్రజల ముందుంచాలని మమత డిమాండ్ చేశారు.
పారదర్శక దర్యాప్తు చేయాలి: లాలు, గోగోయ్
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌లు సైతం ఎక్స్ వేదికగా అజిత్ పవార్ మృతికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో పారదర్శకమైన దర్యాప్తు చేయాలని కోరారు.
విచారణలో నిజాలు వెలుగు చూస్తాయి : రాజాసింగ్
అజిత్ పవార్ మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని గోషామహల్ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ సంతాపం తెలిపారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని.. నిజానిజాలు తెలియాలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. విమాన ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా..సాంకేతిక సమస్య తలెత్తిందా అనేది గుర్తించాల్సి ఉందన్నారు. విమానం బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతే అన్ని విషయాలు బయటికి వస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి :
Ajit Pawar : అజిత్ పవార్ ఆఖరి పోస్టు వైరల్ !
Road Accident| ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
