Ajit Pawar : విమాన ప్రమాదం తర్వాత అజిత్ పవార్‌ను ఎలా గుర్తు పట్టారంటే..?

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం ప్రత్యక్ష సాక్షుల చేతివాచీ, గాగుల్స్ ఆధారంగా గుర్తింపు, కుట్ర కోణంపై అనుమానాలు.

Ajit Pawar

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. కీలక నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోయింది (plane crash). సాంకేతిక సమస్య కారణంగా బారామతి (Baramati) విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. ఆయన మరణంతో దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఓ కీలక నేతను కోల్పోవడంపట్ల పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో అజిత్‌ పవార్‌తోపాటూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని ఎలా గుర్తించారో ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గాగుల్స్‌, చేతివాచీ ఆధారంగా అజిత్‌ పవార్‌ను గుర్తించినట్లు తెలిపారు. వాటి ఆధారంగానే ప్రమాదానికి గురైంది ఉప ముఖ్యమంత్రి అని తెలుసుకున్నట్లు చెప్పారు. కళ్ల ముందే ప్రమాదం జరిగిందని, విమానం ఉన్నట్టుండి కిందకు వస్తుంటే అది కూలిపోయేలా ఉందని తమకు అనిపించిందంటూ ప్రమాదం తీరును వారు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆ సమయంలో విమానం నుంచి శబ్ధం కూడా భిన్నంగా వచ్చినట్లు తెలిపారు.

విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగినట్లు వివరించారు. ఆ శబ్ధంతో ఘటనాస్థలికి పరుగులు తీసినట్లు వెల్లడించారు. అందులో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే, ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదన్నారు. ఇక కళ్లద్దాలు, చేతి వాచీ ఆధారంగా అజిత్‌ పవార్‌ను గుర్తించి బయటకు తీసే ప్రయత్నం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ ఘటన తమకు తీవ్రంగా కలచివేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కుట్ర కోణం..

అజిత్ పవార్ మరణించిన విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉండవచ్చన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో అధికార మహాయూతి కూటమి నుంచి వైదొలిగే ఆలోచన చేస్తున్నారని, అలాగే తిరిగి శరద్ పవార్ ఎన్సీపీ పార్టీతో కలిసే ప్రయత్నాల్లో ఉన్నారని, ఈ క్రమంలో ఆయన విమాన ప్రమాదానికి గురవ్వడం అనుమానాలు రేకెత్తిస్తుందని మమత వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. అత్యున్నత న్యాయస్థానం పైనే తమకు నమ్మకం ఉందన్నారు. మరే ఇతర దర్యాప్తు సంస్థల పైనా తమకు విశ్వాసం లేదని.. అవి వాటి స్వేచ్ఛను కోల్పోయాయని ఆరోపించారు. అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు ప్రజల ముందుంచాలని మమత డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు !
Rajgopal Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబు పేలుస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్

Latest News