IFMIS | తెలంగాణ ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్‌ బెనిఫిట్ల బకాయిలు 11,500 కోట్లు.. శాపంగా మారిన ఐఎఫ్ఎంఐఎస్

ఇది డబ్బుల కథ కాదు జీవితాల కథ! ఇది ఫైళ్ల కథ కాదు ఫ్యామిలీల కథ! తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడో బకాయిల బాంబ్ మీద కూర్చున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏకంగా 11,500 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ప్రతి నెలా ఇంకో 300 కోట్ల రూపాయలు బకాయిల జాబితాలో చేరుతున్నాయి! విడుదల చేస్తోంది ఎంత? కేవలం 700 కోట్లు మాత్రమే! ఇది పరిపాలనా వైఫల్యమా? లేదా IFMIS సిస్టమ్ ఫెయిల్యూరా? లేదా ఉద్యోగుల డబ్బుల మీద నిర్లక్ష్యమా?

Telangana Secretariat amid employee and pensioner pending bills crisis

హైదరాబాద్‌, విధాత ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వోద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులను వేధిస్తున్న బకాయిల గుట్టల వెనుక అసలు కారణం.. ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (IFMIS) అనే వాదన రోజురోజుకు బలపడుతున్నది. ఈ విధానాన్ని 2018లో బీఆరెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది. పారదర్శకత పేరుతో మొదలైన ఈ డిజిటల్‌ విధానం.. ఇప్పుడు ఉద్యోగుల చెల్లింపులకు అడ్డుకట్టగా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు 11,500 కోట్లు దాటాయని చెబుతున్నారు. దీనికి తోడు ప్రతి నెలా ఉద్యోగ విరమణ చేసేవారితో మరో 300 కోట్లు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల బిల్లులు, బకాయిల చెల్లింపులకు 700 కోట్లు మాత్రమే విడుదల చేస్తుండటంతో బకాయిల గుట్ట.. పెరుగుతూనే ఉంది కానీ.. తగ్గడం లేదు.

బీఆరెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన IFMIS విధానం… కాంట్రాక్టర్లకు, తమకు నచ్చిన వారికి డబ్బులు విడుదల చేసేందుకే ఉద్దేశించినట్టు కనిపిస్తున్నదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫలితంగా ఉద్యోగులు తమ బిల్లులు ఎప్పటికప్పుడు డ్రా చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంగతి మరీ ఘోరంగా ఉంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్ల చెల్లింపుల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.6వేల కోట్ల పెండింగ్ ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది రూ.11,500 కోట్లకు పెరిగిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడం మూలంగా ఆ భారమంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బకాయిల గుట్టను తగ్గించేందుకు ప్రతి నెలా రూ.1,500 కోట్లు విడుదల చేస్తే సమస్య ఏడాది వ్యవధిలో తీరిపోతుందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వత అప్పటి సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు పీఆర్సీని ఊహించినంతగా పెంచేశారు. దీంతో ఉద్యోగులు సైతం ఆనందపడ్డారు. ఇంత మంచి ముఖ్యమంత్రి ఇప్పటి వరకూ చరిత్రలోనే లేరంటూ డప్పుకొట్టారు. కానీ.. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ… అదే ప్రభుత్వ ఉద్యోగులకు… చుక్కలు కనిపిస్తున్నాయి. డీఏ బకాయిల కోసం కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటే… ఏళ్లు దాటినా డబ్బులు ఖాతాలో జమ కావడం లేదు. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. పైరవీకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా… పదవీ విరమణ ప్రయోజనాలు చేతికొచ్చే పరిస్థితి లేదు. వీరి పరిస్థితి సచివాలయం ఆర్థిక శాఖలో ఎక్కే మెట్టు దిగే మెట్టు అనే చందంగా ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రతినిత్యం పదుల సంఖ్యలో చక్కర్లు కొడుతున్నా ప్రయోజనం మచ్చుకైనా కన్పించడం లేదు. మరికొందరు హైకోర్టు మెట్లెక్కి న్యాయం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇలా హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుని, తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకు ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారి పెండింగ్ బకాయిలు రూ.11,500 కోట్ల వరకు ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రతి నెలా సరాసరి 600 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. దీంతో ఇప్పటికే పెండింగ్ లో ఉన్నబకాయిలకు అదనంగా మరో రూ.300 కోట్లు ప్రతినెలా చేరిపోతున్నాయి. ఫలితంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తున్నా బకాయిల గుట్ట తగ్గకపోగా పెరుగుతోంది. ఈ లెక్కన మంజూరు చేస్తే బకాయిలు జీరో అవ్వాలంటే కనీసం రెండు సంవత్సరాల వ్యవధి తీసుకుంటుందని ఆర్థిక శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం బకాయిలు, ప్రతి నెలా అదనంగా పెరిగే మొత్తాన్ని కలిపి ప్రతి నెలా రూ.1,500 కోట్ల చొప్పున ఆర్థిక శాఖ విడుదల చేస్తే ఏడాది లోగా బకాయిల చెల్లింపులు పూర్తవుతాయని అంటున్నారు.

ప్రతి నెలా పెన్షనర్లకు పింఛన్‌ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తున్నారు కాని, వారికి చెల్లించాల్సిన బకాయిలను మాత్రం చెల్లించడం లేదని రిటైర్డ్‌ ఉద్యోగులు వాపోతున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఈ బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయని చెబుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాల్సి వస్తుందన్న ఉద్ధేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి మరో మూడు సంవత్సరాలు.. అంటే 61 ఏళ్లకు పెంచారనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో… సరెండర్ లీవులు, ఫెస్టివల్ అలవెన్సులు, జీపీఎఫ్ రుణాలు, టీఏ బిల్లులు, వాహన అలవెన్సులు తదితర 18 రకాల బకాయిలు.. పెండింగ్‌లో పెట్టారు. వీటి మొత్తం సుమారు ఆరువేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పదవీ విరమణ చేసేవారు పెరిగిపోయారు. దీంతో బకాయిలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రతి నెలా రూ.7,00 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేస్తున్నది. ఈ మొత్తం నుంచి రూ.300 కోట్లు జీపీఎఫ్‌కు, మిగతా రూ.400 కోట్లు సీనియార్టీ ప్రకారం చెల్లిస్తున్నారు. రిటైర్‌ అయిన వారికి ఇంకా రూ.2వేల కోట్ల వరకు జీపీఎఫ్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

ఐఎఫ్ఐఎంఎస్ రాక ముందు…

బీఆర్ఎస్ పాలకులు 2018 సంవత్సరంలో ఆర్థిక శాఖలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజిమెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) విధానం తీసుకువచ్చారు. ఈ ఆన్ లైన్ విధానంతో ఏ రోజు ఎంత ఆదాయం వస్తున్నది? ఎవరికి చెల్లిస్తున్నారు? అనేది సుస్పష్టంగా కనిపిస్తుంటుంది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్, ఇతర బిల్లుల కోసం ప్రతి నెలా వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు వెల్లడి అయ్యింది. దీంతో వీరి చెల్లింపులకు కత్తెర వేయాలని బీఆరెస్‌ పాలకులు భావించారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి చెల్లింపులను ఆపివేయాలని, కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు చేయాలని బీఆర్ఎస్ పెద్దలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఫలితంగానే బకాయిలు ప్రతి నెలా పెరిగి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి శాపంగా మారిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఐఎఫ్ఐఎంఎస్ విధానం రాక ముందు డిస్ట్రిక్ట్ ట్రెజరీలో బిల్లులు సమర్పించిన వెంటనే చెల్లింపులు జరిగేవని, పెండింగ్ లో ఉండేవి కాదంటున్నారు. ఇలా బిల్లులు సమర్పించగానే.. అలా చెల్లింపులు జరిగిపోయేవని గుర్తు చేసుకుంటున్నారు. వాహనాల అలవెన్సులు, ఇతర అలవెన్సులు కూడా నెలల తరబడి చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారని వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే విధానం అనుసరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎంతకాలం సాగదీస్తే ప్రభుత్వానికి అంత భారం పెరుగుతూ ఉంటుందని, ఇప్పటికైనా తగిన నిర్ణయం తీసుకుని, ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించేలా, రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్లు వెంటనే చెల్లించే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Retired Employees Protest| రిటైర్డ్ ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడి..ఉద్రిక్తత
Telangana | ప్రాణాలు పోతున్న పైసలు ఇవ్వరా? రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
Gold Price Down | తొందరపడి బంగారం కొనేయకండి.. ధరలు భారీగా పడిపోనున్నాయ్.. ఇవిగో ఫ్రూప్స్!
Rajgopal Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబు పేలుస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్

Latest News