దేశంలో ఎక్క‌డా లేని విధంగా శ్రీరామ‌న‌వ‌మి నాడు నాన్ వెజ్ దావ‌త్‌..! ఎక్క‌డంటే..?

హిందువులు త‌మ పండుగ‌ల‌ను ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. ఇంటిని శుభ్రంగా క‌డుక్కొని, కొత్త బ‌ట్ట‌లు ధ‌రించి పూజాకార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మైపోతారు. ఇక ప‌ర్వ‌దినాల నాడు నాన్ వెజ్ జోలికి వెళ్ల‌నే వెళ్ల‌రు. ఎంతో నిష్ట‌తో పూజల్లో పాల్గొని, త‌మ మొక్కుల‌ను స‌మ‌ర్పించుకుంటారు.

  • Publish Date - April 16, 2024 / 08:00 AM IST

హిందువులు త‌మ పండుగ‌ల‌ను ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. ఇంటిని శుభ్రంగా క‌డుక్కొని, కొత్త బ‌ట్ట‌లు ధ‌రించి పూజాకార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మైపోతారు. ఇక ప‌ర్వ‌దినాల నాడు నాన్ వెజ్ జోలికి వెళ్ల‌నే వెళ్ల‌రు. ఎంతో నిష్ట‌తో పూజల్లో పాల్గొని, త‌మ మొక్కుల‌ను స‌మ‌ర్పించుకుంటారు.

అయితే ఈ గ్రామంలో మాత్రం శ్రీరామ‌న‌వ‌మి నాడు నాన్ వెజ్ దావ‌త్ నిర్వ‌హించుకుంటున్నారు. ఇదేదో ఇప్పుడు వ‌చ్చిన సంప్ర‌దాయం కాద‌ట‌. వంద‌ల ఏండ్ల నుంచి కొన‌సాగుతున్న సంప్ర‌దాయ‌మ‌ని ఆ గ్రామ‌స్తులు చెబుతున్నారు. సీతారాముల క‌ల్యాణం ముగిసిన అనంత‌రం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో గ్రామ‌స్తులంతా త‌మ స్తోమ‌త‌ను బ‌ట్టి మేక‌లు, కోళ్ల‌ను కోసుకుని నాన్ వెజ్ వేడుక చేసుకుంటార‌ట‌. మ‌రి ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే.. ఎక్క‌డో వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఆ గ్రామం మ‌న తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.

యాదాద్రి జిల్లా గుండాల మండ‌లం సీతారాంపురం గ్రామం అది. ఈ గ్రామంలోని రామాల‌యంలో ఐదు రోజుల పాటు సీతారాముల క‌ల్యాణ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తారు. న‌వ‌మికి రెండు రోజుల ముందే వేడుక‌లు ప్రారంభ‌మ‌వుతాయి. క‌ల్యాణం రోజున గ‌రుడ ముద్ద‌(అన్నం ముద్ద‌లు) ఎగ‌ర‌వేయం ఇక్క‌డి ఆన‌వాయితీ. అలా ఎగ‌రేసిన ముద్ద‌లు అందుకుని తిన్న‌వారికి శుభాలు క‌లుగుతాయ‌ని గ్రామ‌స్తుల న‌మ్మ‌కం.

ఆల‌యంలో సీతారాముల క‌ల్యాణ వేడుక పూర్త‌యిన త‌ర్వాత‌.. గ్రామ‌స్తులంతా త‌మ ఇండ్ల‌కు చేరుకుంటారు. ఇక త‌మ ఆర్థిక స్థోమ‌త‌ను బ‌ట్టి ఇంట్లో మేక‌లు, కోళ్లు కోసుకుని నాన్ వెజ్ దావ‌త్ చేసుకుంటారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా న‌వమి రోజు నాన్ వెజ్ దావ‌త్ చేసుకోవ‌డం కొన్ని వంద‌ల ఏండ్ల క్రితమే మొద‌లైంద‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.

ఆ ఆచారం కొన‌సాగుతుందిలా..

వంద‌ల ఏండ్ల క్రితం.. గ్రామంలో భూస్వాములు, పెత్తందార్లు ఉండేవారు. వారి ఆధ్వ‌ర్యంలోనే సీతారాముల క‌ల్యాణం జ‌రిగేది. ఇక సీతారాముల క‌ల్యాణం వీక్షించేందుకు భూస్వాముల‌, పెత్తందార్ల కూతుళ్లు, అల్లుళ్లు గ్రామానికి వ‌చ్చేవారు. వారికి దావ‌త్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో క‌ల్యాణం అయిపోయాక‌.. మేక‌ల‌ను, కోళ్ల‌ను కోసి వండిపెట్టేవార‌ని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇక ఆనాటి నుంచి నేటికి ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంద‌ని తెలిపారు.

ఈ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తే సంతానం క‌లుగుతుంద‌ట‌..!

కాక‌తీయుల కాలంలోనే ఈ సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యం నిర్మించిన‌ట్లు గ్రామ‌స్తులు చెబుతుంటారు. ఆ ఆల‌యం పేరు మీద‌నే ఈ గ్రామానికి సీతారాంపురం అనే పేరు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఆ ఆల‌యంలో మండ‌పం స‌హా సీతారామ‌, ల‌క్ష్మ‌ణ‌, ఆంజ‌నేయ స్వామి విగ్ర‌హాల‌తో పాటు సంతాన గోపాల‌స్వామి, ఆండాల‌మ్మ‌, గోదాదేవి, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. పిల్ల‌లు లేని వారు త‌డి బ‌ట్ట‌ల‌తో ఆల‌య ప్ర‌ద‌క్షిణ చేసి సంతాన గోపాల‌స్వామిని ద‌ర్శించుకుంటే సంతానం క‌లుగుతుంద‌ని గ్రామ‌స్తుల న‌మ్మ‌కం.

Latest News