Sun Transit in Scorpio | సూర్యుడు( Sun ) ప్రతి నెల తన గమనాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి సూర్యుడు ప్రవేశం చేస్తుంటాడు. సూర్య సంచారాన్ని సూర్య సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో సంక్రమణం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ నెల 16 వ తేదీ ఆదివారం సూర్యుడు తులా రాశి( Libra ) నుంచి వృశ్చిక రాశి( Scorpio )లోకి ప్రవేశించనున్నాడు.
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం.. నవంబర్ 16 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:36 నిమిషాలకు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇందులో మధ్యాహ్నం 01:12 నుంచి 01:36 వరకు మధ్యలో ఉన్న కాలాన్ని మహా పుష్కర కాలం అని అంటారు. ఈ సమయంలో నదుల్లో కానీ, సముద్రంలో కానీ స్నానం చేయడం శుభకరమని పండితులు చెబుతారు. పాపాల నుంచి విముక్తి పొంది.. ఎంతో పుణ్యం లభించి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఈ వృశ్చిక సంక్రమణం రోజు చేసే సూర్యుని ఆరాధన వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, కార్య సిద్ధి కలుగుతాయని, శత్రు పీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతోంది. ఇక సూర్యుని ప్రీతి కోసం వెలిగించే దీపంలో ఎర్రచందనం, నెయ్యి కలిపి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం. సూర్యుని పూజించే సమయంలో సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ పారాయణ చేస్తే మంచి ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం.
వృశ్చిక సంక్రమణం రోజు బ్రాహ్మణులకు అన్నదానం, గోదానం, భూదానం వంటివి చేయడం వలన ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే పేదలకు, ఆహారం, బట్టలు, దానం చేయడం శుభ ప్రదంగా భావిస్తారు.
