విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలోని సుప్రసిద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, అంకురార్పణ నిర్వహించారు. ఆదివారం ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సోమవారం శ్రీవారి కల్యాణోత్సవం వేడుక ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామన్నాయణ రామానుజ చిన్న చినజీయర్ స్వామిజీ మంగళశాసనాలతో..పైళ్ల మల్లారెడ్డి సాధన దంపతుల దాతృత్వంతో పాంచరాత్రగమ శాస్త్రానుసారం సోమవారం మధ్యాహ్నం 12గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం వేడుకను నిర్వహించనున్నారు. కల్యాణోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే రోజు సాయంత్రం స్థానిక ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 18వ తేదీన స్వామి అమ్మవార్ల రథోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు స్వామివారి కల్యాణోత్సవ వేడుకకు హాజరవుతున్న నేపథ్యంలో వలిగొండ నుంచి సుంకిశాల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ నియంత్రణకు పోలీసులు అవసరమైన బందోబస్తు చేపట్టారు.
