విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం వైభవంగా జరిగిన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాల్లో మంగళవారం ద్వార తోరణం, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభఆరాధన, చతుస్థానార్చన, నిత్యహోమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం “శ్రీ సుదర్శన నారసింహ ఇష్టి”, పూర్ణాహుతి, బలిహరణం, నివేదన, తీర్ధ ప్రసాద గోష్ఠి శాస్త్రయుక్తంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం మహా పూర్ణాహుతి, గరుడ వాహన సేవ, చక్రతీర్ధం, దేవతోద్వాసనం, పుష్పయాగం, ధ్వజావరోహణం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆయా కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు , వలిగొండ ఎంపీడీవో జి.జలంధర్ రెడ్డి, దేవస్థానం ఘాట్ రోడ్డు దాత గార్లపాటి పుష్పలత-సురేందర్ రెడ్డి, గ్రామపంచాయితీల సెక్రటరీలు సురేష్ రెడ్డి, సైదులు, నరేందర్, మత్స్యగిరి, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
