Education | ఫుడ్ & న్యూట్రిషన్‌ కోర్సులతో విభిన్న కొలువులు.. అవేంటో చూద్దామా..?

Education | ప్రస్తుతం ఫుడ్ & న్యూట్రిషన్‌ కోర్సులకు మాంచి డిమాండ్‌ ఉంది. ఫుడ్ & న్యూట్రిషన్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి విభిన్న జాబ్‌ ప్రొఫైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వారు న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, ఫుడ్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ లాంటి కొలువులను సొంతం చేసుకోవచ్చు. వారికి ప్రారంభంలోనే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనం అందుతుంది.

  • Publish Date - April 27, 2024 / 08:55 AM IST

Education : ప్రస్తుతం ఫుడ్ & న్యూట్రిషన్‌ కోర్సులకు మాంచి డిమాండ్‌ ఉంది. ఫుడ్ & న్యూట్రిషన్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి విభిన్న జాబ్‌ ప్రొఫైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వారు న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, ఫుడ్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ లాంటి కొలువులను సొంతం చేసుకోవచ్చు. వారికి ప్రారంభంలోనే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనం అందుతుంది. ఫుడ్ & న్యూట్రిషన్‌ కోర్సు పూర్తిచేసిన వారికి లభించే ఉద్యోగావకాశాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

డైటీషియన్‌

రోగులు మాత్రమే కాకుండా వ్యక్తులు ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన ఆహారపు అలవాట్లను డైటీషియన్‌లు సూచిస్తారు. పోషకాహారం అంటే ఏమిటి ఆయా వ్యక్తుల అవసరాలకు తగ్గట్టు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన నిబంధనలు తదితర విషయాలను వీరు వివరిస్తారు.

న్యూట్రిషనిస్ట్‌

హెల్త్‌కేర్‌ రంగంలో ముఖ్యంగా హాస్పిటల్స్‌లో ఈ న్యూట్రిషనిస్ట్‌ ఉద్యోగాలు లభిస్తాయి. వీరు రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారు పాటించాల్సిన ఆహార నియమాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డయాబెటిస్, ఒబేసిటీ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆహార నియామాలను సూచించాల్సి ఉంటుంది.

ఫుడ్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌

వీరికి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడం, వాటికి సంబంధించి పరిశోధనలు చేయడం లాంటి విధులు ఉంటాయి. ఆహార పదార్థాలను కెమికల్‌గా, బయలాజికల్‌గా పరీక్షించి.. నాణ్యమైన ఉత్పత్తిని రూపొందించేలా సూచనలు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు ఆహార పదార్థాల తయారీ సంస్థల్లో లభిస్తాయి.

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌

వీరు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి వాటిలో లోటుపాట్లను గుర్తించడం.. నాణ్యమైన ఆహారం తయారీకి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడం లాంటి విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రెండు రంగాల్లోనూ ఈ కొలువులు లభిస్తున్నాయి.

హెల్త్‌ ఎడ్యుకేటర్‌

ఈ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ఉద్యోగాలు ఎక్కువగా ప్రభుత్వ విభాగాల్లో లభిస్తాయి. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అందుకోసం పాటించాల్సిన ఆహార నియమాలను సూచించడం వంటి విధులు వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్‌ విభాగంలో ఈ కొలువులు లభిస్తాయి.

Latest News