Group-1 hall tickets : తెలంగాణ గ్రూప్-1 (TS Group-1) ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. జూన్ 9న పరీక్ష జరగనున్న నేపథ్యంలో తాజాగా హాల్ టికెట్ల విడుదలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటన వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
వచ్చే నెల 9న జరగనున్న ఈ ప్రిలిమినరీ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. కాగా ఈ పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరని అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే ఇవాళ తెలంగాణ పాలిసెట్-2024 (TS Polycet-2024) ప్రవేశ పరీక్ష జరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కోసం అధికారులు 259 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.