విధాత : బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2 తాండవం’ సినిమా ట్రైలర్ను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్ళా పూర్ లో నిర్వహించిన ఈవెంట్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ చేతుల మీదుగా ట్రైలర్ ను ఆవిష్కరించారు. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ బాలయ్య నట ఉగ్రరూపాన్ని ఆవిష్కరించింది.
సనాతన హిందూ ధర్మం, సంస్కృతిల గొప్పతనాన్ని చాటుతూ అఘోర పాత్రలో బాలయ్య చెప్పిన డైలాగులు… పోరాట దృశ్యాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కష్టమొచ్చినా దేవుడు వస్తాడని నమ్మే జనానికి.. కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అప్పుడే.. ఈ భారతదేశం తునా తునకలవుతుంది ..డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్లో విదేశీ సైనికులతో మంచు కొండల్లో అఘోర పోరాట దృశ్యాలు.. మహా కుంభమేళాలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకునేలా కనిపించాయి. ఆది పినిశెట్టి అఘోరాను ఎదుర్కొనే తాంత్రికుడి పాత్రలో కనిపించారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ, ఈ దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుందన్నారు. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమే అఖండ 2 అని పేర్కొన్నారు. ఈ సినిమాని దేశమంతా చూడాలన్నారు. గతంలో వచ్చిన హిట్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘అఖండ 2 తాండవం’ మూవీలో కథానాయకగా సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటించారు.
