Bigg Boss 9 | కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 21న జరిగిన ఈ ఫినాలేకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన రేటింగ్స్ రూపంలో స్పష్టంగా కనిపించింది. తాజాగా విడుదలైన టీఆర్పీ గణాంకాలు చూస్తే, ఈ సీజన్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అర్థమవుతోంది. ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ నమోదు కావడం విశేషం. గత ఐదేళ్లలో ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో ఇదే అత్యధిక రేటింగ్‌గా నిలిచింది.
ఈ ఘనవిజయంపై హోస్ట్ నాగార్జున ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్టార్ మా ఛానెల్‌లో 19.6 టీవీఆర్ రావడంతో పాటు, జియో హాట్‌స్టార్ ఓటీటీలో 285 మిలియన్ నిమిషాల వాచ్ టైమ్ నమోదైనట్టు వెల్లడించారు. “అన్‌బీటబుల్, అన్‌రీచబుల్.. భావోద్వేగాలు, ప్యాషన్, సంఘర్షణలతో నిండిన ఈ సీజన్ నిజంగా చరిత్రాత్మకం. ఈ ప్రయాణాన్ని విజయవంతం చేసిన కోట్లాది మంది ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు, స్టార్ మా, ఎండెమోల్ షైన్ ఇండియా టీమ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ నాగార్జున చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
15 వారాల పాటు ప్రేక్షకులను కట్టిపడేసిన బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ చివరికి ఉత్కంఠభరిత ఫినాలేతో ముగిసింది. ఈ సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, అనూహ్యంగా ఒక సామాన్యుడు విజేతగా నిలవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మాజీ సైనికుడు కళ్యాణ్ పడాల ఈ సీజన్ విజేతగా నిలిచి బిగ్‌బాస్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ఆరంభంలో పెద్దగా అంచనాలు లేకపోయినా, తన ఆటతీరుతో ‘మొదటి ఫైనలిస్ట్’గా నిలిచి చివరికి టైటిల్ గెలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. రన్నరప్‌గా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి నిలిచింది.
టాప్-3లో కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్ ఉండగా, ఫినాలేలో బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. మాస్ మహారాజా రవితేజ హౌస్‌లోకి వచ్చి రూ. 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ ప్రకటించడంతో హౌస్ ఒక్కసారిగా ఉత్కంఠకు గురైంది. కొంతసేపు ఆలోచించిన తర్వాత డీమాన్ పవన్ ఆ మొత్తాన్ని తీసుకుని పోటీ నుంచి తప్పుకోవడంతో, విజేతకు దక్కాల్సిన రూ. 50 లక్షల ప్రైజ్ మనీ నుంచి రూ. 15 లక్షలు తగ్గి, రూ. 35 లక్షలు మాత్రమే మిగిలాయి.
విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాలకు నాగార్జున స్వయంగా ట్రోఫీతో పాటు భారీ బహుమతులను అందజేశారు. ఆయనకు రూ. 35 లక్షల నగదు, మారుతి సుజుకి వెక్టోరిస్ కారు, అలాగే రాఫ్ టైల్స్ తరఫున మరో రూ. 5 లక్షల నగదు బహుమతి లభించింది. మొత్తంగా బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ కంటెంట్, ఫినాలే ఉత్కంఠ, రికార్డు రేటింగ్స్‌తో బుల్లితెరపై తనదైన ముద్ర వేసి చరిత్రలో నిలిచింది.
