Tanuja | హీరోయిన్స్ మాదిరిగానే బిగ్ బాస్ బ్యూటీకి కూడా చేదు అనుభ‌వం.. తోయోద్ద‌న్నా విన‌ని ఫ్యాన్స్

Tanuja |ఇటీవల సెలబ్రిటీల ఈవెంట్లలో భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. అభిమానం హద్దులు దాటితే ప్రమాదమేనన్న వాస్తవం మరోసారి వెలుగులోకి వచ్చింది.

Tanuja |ఇటీవల సెలబ్రిటీల ఈవెంట్లలో భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. అభిమానం హద్దులు దాటితే ప్రమాదమేనన్న వాస్తవం మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కూడా సెలబ్రిటీలను చూసిన వెంటనే ఫ్యాన్స్ నియంత్రణ కోల్పోయి గుమిగూడటం, తోపులాటలకు దిగడం ఆందోళన కలిగిస్తోంది.

గతంలో నిధి అగర్వాల్, సమంత, అల్లు అర్జున్, విజయ్ వంటి స్టార్‌లు ఈ తరహా ఘటనలతో ఇబ్బంది పడ్డారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ తనూజ కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది. “మీ కోసమే వచ్చాను, దయచేసి తోయొద్దు” అని ఆమె కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కొద్ది సేపు తోపులాట జరగడంతో ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్లు “ఇది అభిమానం కాదు, బాధ్యతలేని ప్రవర్తన” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదే తరహాలో లుల్లు మాల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌పై గుంపు ఒక్కసారిగా దూసుకెళ్లడం, సమంత షాప్ ఓపెనింగ్ సమయంలో ఫ్యాన్స్ అదుపు తప్పడం వంటి ఘటనలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక సందర్భంలో సమంత చీరని తొక్కడంతో ఆమె కిందపడే ప్రమాదం కూడా తలెత్తింది. అలాగే ఇటీవల అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డితో కలిసి హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్‌కి వెళ్లిన సమయంలోనూ అభిమానులు గుమిగూడి, సెల్ఫీల కోసం మితిమీరిన ప్రవర్తన చూపించారు. కారులోకి ఎక్కడం కూడా వారికి కష్టసాధ్యంగా మారింది. ఈ వరుస ఘటనలు సెలబ్రిటీల ఈవెంట్లలో క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రత ఎంత కీలకమో గుర్తు చేస్తున్నాయి. అభిమానుల ప్రేమ అనేది హద్దుల్లో ఉంటేనే అందరికీ మేలు చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక తనూజ విషయానికి వస్తే—ఆమె పూర్తి పేరు తనూజ పుట్ట స్వామి. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో కన్నడ హారర్ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, జీ తెలుగు సీరియల్ ‘ముద్దమందారం’తో విశేషమైన పేరు సంపాదించారు. 1500 ఎపిసోడ్లు పూర్తి చేసిన ఈ సీరియల్ ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఆ ఫేమ్‌తోనే తెలుగు బిగ్‌బాస్‌ 9లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. ఈ సీజన్‌లో కళ్యాణ్ పడాలా విజేతగా ట్రోఫీ అందుకున్నారు.

ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు, అభిమానులు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Latest News