Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి మనిషికి ఒక దిక్సూచి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి, అంచలంచలుగా ఎదుగుతూ నేడు భారతీయ సినీ పరిశ్రమ గర్వించే స్థాయికి చేరడం వెనుక అపారమైన కష్టం, పట్టుదలతో పాటు ఎన్నో అవమానాలు, కన్నీళ్లు దాగి ఉన్నాయి. తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని చిరంజీవి ఇటీవల ఓ ఈవెంట్‌లో పంచుకోగా, అది ఇప్పుడు అభిమానులను తీవ్రంగా కదిలిస్తోంది.
కాసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటే..
తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ .. ఆ అవమానమే తనలో సూపర్ స్టార్ అవ్వాలనే తపనను మరింత బలపరిచిందని వెల్లడించారు చిరంజీవి. ‘న్యాయం కావాలి’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజుల్లో నేను షూటింగ్‌తో బిజీగా ఉండేవాడిని. క్రాంతి కుమార్ నిర్మాతగా, కోదండరామి రెడ్డి గారు దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. షాట్ బ్రేక్ సమయంలో కొద్దిసేపు రిలాక్స్ అవుదామని బయట నిల్చున్నాను. ఈలోపు మరో షాట్ రెడీ అయ్యింది. అసిస్టెంట్ డైరెక్టర్ పిలవగానే వెంటనే వచ్చి కెమెరా ముందు నిల్చున్నాను.
అప్పుడే కెమెరా వద్ద కూర్చున్న నిర్మాత క్రాంతి కుమార్ గారు నాపై గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ‘ఏమయ్యా.. నిన్ను ప్రత్యేకంగా పిలవాలా? ఇక్కడే ఉండలేవా? జగ్గయ్య, శారదా వంటి పెద్ద స్టార్స్ ఇక్కడే ఉన్నారు కదా. అప్పుడే పెద్ద సూపర్ స్టార్ అయ్యాను అని అనుకుంటున్నావా? ఇక్కడే ఉండు’ అని అందరి ముందే గట్టిగా అన్నారు” అని చిరంజీవి వివరించారు. ఆ సంఘటన అక్కడ ఉన్న 300 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టుల ముందు జరిగింది. ఆ అవమానం తనను తీవ్రంగా కలచివేసిందని చిరంజీవి చెప్పారు.
భోజనం కూడా చేయలేకపోయాను..
ఆ రోజు నాకు చాలా అవమానంగా అనిపించింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేకపోయాను. సాయంత్రం షూటింగ్ పూర్తయ్యాక నేరుగా ఇంటికి వెళ్లిపోయాను అని ఆయన అన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామం తన జీవితాన్ని మార్చిందని చిరంజీవి తెలిపారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే క్రాంతి కుమార్ గారు ఫోన్ చేశారు. ‘శారదా గారికి వయస్సు కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిందేమో.. ఫిల్మ్ తినేస్తున్నారు’ అని చెప్పారు. అప్పట్లో ఫిల్మ్ చాలా విలువైనది. ఆ టెన్షన్‌లో ఆమెపై ఉన్న కోపం నాపై చూపించారు. కానీ ఆయన అన్న ఒక మాట మాత్రం నా మనసులో బలంగా రిజిస్టర్ అయింది. ‘పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా?’ అన్నారు కదా.. అవును, సూపర్ స్టార్ అయ్యి చూపించాలి అనే కసి నాలో అప్పుడే పుట్టింది. చివరికి అయ్యి చూపించాను” అంటూ చిరంజీవి భావోద్వేగంగా చెప్పారు.
ఈ మాటలు విన్న అభిమానులు, యువత చిరంజీవి జీవితాన్ని మరోసారి ఆదర్శంగా తీసుకుంటున్నారు. అవమానాన్ని ఓటమిగా కాకుండా విజయానికి మెట్టుగా మార్చుకున్న మెగాస్టార్ ప్రయాణం, నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
