Ram Charan | మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్–ఉపాసన దంపతులు జనవరి 31న కవల పిల్లలను తమ జీవితంలోకి ఆహ్వానించగా, ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టిన వార్త తెలియగానే మెగా ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఫిబ్రవరి 1న అపోలో ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని తమ అభిమాన హీరో కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.అభిమానుల ప్రేమకు ప్రతిఫలంగా మెగా కుటుంబం ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేసింది. ఈ గిఫ్ట్ బాక్సులకు సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎరుపు రంగు ఆకర్షణీయమైన బాక్స్‌పై రామ్ చరణ్, ఉపాసనల ఫొటోలు ముద్రించి ఉండగా, లోపల రెండు గిన్నెలు, వాటికి సరిపోయే స్పూన్లు, ఒక ప్లేట్ ఉంచారు. ఆ ప్లేట్‌పై పిల్లలు పుట్టిన తేదీ “31-01-2026” అని ముద్రించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. అదనంగా స్వీట్లు కూడా అందించారు. ఈ గిఫ్ట్‌లపై నెటిజన్లలో చర్చ నెలకొంది. ఇవి స్వచ్ఛమైన వెండి వస్తువులా లేదా వెండి పూత పూసినవా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వివరాలు పరిశీలిస్తే ఇవి ‘అష్టోక్’ బ్రాండ్‌కు చెందిన జర్మన్ సిల్వర్ వస్తువులని తెలుస్తోంది. మార్కెట్‌లో ఒక్కో సెట్ ధర సుమారు రూ.399 ఉండగా, బల్క్‌లో కొనుగోలు చేస్తే రూ.276 వరకు లభిస్తుందని సమాచారం. అయినప్పటికీ తమ అభిమాన హీరో నుంచి వచ్చిన కానుకగా అభిమానులు ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నారు.
మరోవైపు ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఫిబ్రవరి 1న రామ్ చరణ్ తన రెండేళ్ల కుమార్తె క్లిన్ కారాతో ఆసుపత్రికి వచ్చిన సమయంలో అభిమానులు పెద్దఎత్తున గుమిగూడి సెల్ఫీల కోసం ఎగబడటంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. అదనంగా ఆసుపత్రి ఆవరణలో కొందరు అభిమానులు బాణసంచా కాల్చడం విమర్శలకు దారితీసింది. ఆసుపత్రి పరిసరాల్లో శబ్ద కాలుష్యం రోగులకు, చిన్నారులకు ఇబ్బంది కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చిలో విడుదలకు సిద్ధమవుతుండగా, ఆ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా కుటుంబంలో డబుల్ సంతోషం నెలకొన్న ఈ వేళ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
