Pawan Kalyan | డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు గుడ్‌బై చెబుతారేమో అన్న చర్చలకు తాజాగా బ్రేక్ పడింది. ‘ఓజీ’ భారీ విజయంతో అభిమానులకు కిక్ ఇచ్చిన పవన్, ‘ఓజీ 2’ కూడా చేస్తానని హింట్ ఇవ్వడమే కాకుండా, న్యూ ఇయర్ రోజున మరో పెద్ద సర్‌ప్రైజ్ ప్రకటించారు. త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా ఆయన కొత్త సినిమా అధికారికంగా ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో, దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు నేడు అధికారికంగా వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ గతంలోనే ఒకసారి ప్రకటించబడినప్పటికీ, పవన్ రాజకీయాల్లో బిజీ కావడం, ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా పక్కన పడిపోయిందనే భావన అభిమానుల్లో ఏర్పడింది. అయితే, న్యూ ఇయర్ సందర్భంగా ఇదే సినిమాను మళ్లీ కొత్తగా ప్రకటిస్తూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకుడు సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పేరుతోనే ఏర్పాటు చేసిన ‘జైత్ర రామ్ మూవీస్’ బ్యానర్‌పై నిర్మించనున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీతో కలిసి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం తన కల అని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. రామ్ తాళ్లూరి ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల పవన్ కళ్యాణ్ తక్కువ హెయిర్‌తో కొత్త లుక్‌లో కనిపించడంపై కూడా చర్చ జరిగింది. అది ఈ సినిమా కోసమేనని ఇప్పుడు ఫ్యాన్స్ భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, కొత్త సినిమా ప్రకటించడం పవన్ సినిమాలపై ఇంకా పూర్తి స్థాయిలో ఆసక్తి తగ్గలేదని స్పష్టమవుతోంది. గతంలో రామ్ తాళ్లూరి ‘నెల టికెట్’, ‘చుట్టాలబ్బాయి’, ‘మెకానిక్ రాకీ’ వంటి సినిమాలను SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి చివరి సినిమా ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్‌తో కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి న్యూ ఇయర్ రోజున పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటనతో ఫ్యాన్స్‌కు పండగే పండగగా మారింది.
