Prabhas | ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన.. డార్లింగ్ ఇచ్చిన స‌మాధానానికి అంతా షాక్

Prabhas |ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ ‘ది రాజాసాబ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas |ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ ‘ది రాజాసాబ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ చేసిన సరదా వ్యాఖ్యలు, దర్శకుడు మారుతి భావోద్వేగం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ఈవెంట్‌లో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావడంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. “ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?” అంటూ ఓ లేడీ ఫ్యాన్ ప్లకార్డు చూపించగా, దానికి ప్రభాస్ నవ్వుతూ “అది తెలియకే ఇంకా పెళ్లి చేసుకోలేదు” అంటూ చమత్కరించారు. మరో ప్రశ్నకు స్పందించిన నిధి అగర్వాల్, తనను పెళ్లి చేసుకోవాలంటే “ప్రేమించే వృత్తి ఉండాలి” అంటూ సమాధానమిచ్చింది. అయితే చాలా కాలం తర్వాత ప్రభాస్ నోట పెళ్లి మాట రావడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తనతో పనిచేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పమన్న యాంకర్ సుమ ప్రశ్నకు ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించారు. ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్లను జీనియస్‌లుగా పేర్కొంటూ, పూరి న్యూ ట్రెండ్ క్రియేట్ చేశారని అన్నారు. నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ డైరెక్టర్, ప్రశాంత్ నీల్ బ్యూటిఫుల్ పర్సన్, మారుతి క్యూట్ పర్సన్, హను రాఘవపూడి వెరీ హార్డ్ వర్కింగ్, సుజీత్ స్మార్ట్ గై, సందీప్ రెడ్డి వంగా కల్ట్ డైరెక్టర్ అని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం తాను ‘స్పిరిట్’ షూటింగ్ నుంచి వస్తున్నానని వెల్లడించారు.

చాలా గ్యాప్ తర్వాత ప్రజల్లోకి వచ్చిన ప్రభాస్ న్యూ లుక్ ఆకట్టుకుంది. గుబురు గడ్డం, పిలకతో కనిపించిన ఆయన లుక్ ‘స్పిరిట్’ సినిమాలోనిదే కావొచ్చని అభిమానులు చర్చిస్తున్నారు. పోలీసాఫీసర్ పాత్రలో డిఫరెంట్ లుక్స్ ఉంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వేదికపై దర్శకుడు మారుతి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న మారుతిని ప్రభాస్ వేదికపైకి వచ్చి ఓదార్చారు. తనకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, ‘ది రాజాసాబ్’ అందరినీ ఆకట్టుకుంటుందని మారుతి ధీమా వ్యక్తం చేశారు. సినిమా నిరాశపరిస్తే తన ఇంటికే వచ్చి ప్రశ్నించండని చెప్పుతూ కొండాపూర్‌లోని తన ఇంటి అడ్రస్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మొత్తంగా ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రభాస్ సరదా మాటలు, న్యూ లుక్, మారుతి ఎమోషనల్ మూమెంట్స్‌తో అభిమానులకు గుర్తుండిపోయే వేడుకగా మారింది.

Latest News