Rajamouli | దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటికే బాహుబలి , ఆర్ఆర్ఆర్ లాంటి పాన్‌వరల్డ్ బ్లాక్‌బస్టర్స్‌తో తెలుగు సినిమాకి గ్లోబల్ రేంజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మహేష్‌బాబుతో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రం బడ్జెట్ మొదట్లో రూ.1000 కోట్లు అని ప్రచారం జరిగినా, తాజా సమాచారం ప్రకారం అది రూ.1200–1500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ సినీ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్‌తో సింగిల్ పార్ట్ సినిమా రావడం ఇదే మొదటిసారి.
ఫ్యామిలీ అంతా ఒక టీమ్ – రాజమౌళి సక్సెస్ సీక్రెట్
రాజమౌళి సినిమాల వెనుక అతిపెద్ద బలం ఆయన కుటుంబమే. ప్రతి సినిమా ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్‌లా తయారవుతుందని ఇండస్ట్రీలో మాట. కీరవాణి- సంగీతం, విజయేంద్ర ప్రసాద్- కథ, స్క్రీన్ ప్లే, రమా రాజమౌళి- కాస్ట్యూమ్ డిజైన్, రాజమౌళి- విజన్, డైరెక్షన్‌తో ఏ ప్రాజెక్ట్ అయిన బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. అయితే రాజమౌళి భార్య రమా రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టీమ్‌వర్క్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
స్టోరీ మొదలు ఎక్కడంటే… !
ఒక సినిమా పూర్తికాగానే రాజమౌళి స్వల్ప విరామం కోసం ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తారు. అయితే ఫిజికల్‌గా రిలాక్స్ అవుతున్నా, ఆయన బ్రెయిన్ మాత్రం అప్పటికే తర్వాతి సినిమాకథ గురించి ఆలోచించడం ప్రారంభిస్తుందని రమా రాజమౌళి చెప్పారు. కథ ఐడియా రాగానే ముందుగా నాకు చెబుతాడు ” అని ఆమె వెల్లడించారు. కొన్ని సినిమాలకు కథ నేరుగా విజయేంద్ర ప్రసాద్ నుంచే వస్తుందని, మరికొన్ని రాజమౌళి స్వయంగా ఆలోచిస్తారని చెప్పారు.
రాజమౌళి ‘మతిమరుపు’ ఫన్ స్టోరీ
రమా రాజమౌళి చెప్పిన మరో ఆసక్తికర విషయం అందరిని నవ్విస్తోంది. తన మనసంతా స్టోరీ ఐడియాలపై ఉండటం వల్ల రాజమౌళి కొన్ని చిన్న విషయాలు మర్చిపోతారట. ఇతరుల ఇంటికి వెళ్లి టీవీ రిమోట్‌ను తన ఫోన్ అనుకుని జేబులో పెట్టుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి అని రమా నవ్వుతూ చెప్పారు. ఇంట్లో ఏదైన వస్తువు కనిపించకపోతే “అది నంది జేబులో ఉందో చూడండి” అనేవారట. ఇక రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైన్‌లో ప్రత్యేక కోర్సులు చేయలేదని, ఈ పనిని పూర్తిగా ప్రేమతో నేర్చుకున్నానని చెప్పారు. “నా కెరీర్ ప్లాన్ ప్రకారం జరిగింది కాదు… రాజమౌళి కోసమే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తున్నాను” అని ఆమె వెల్లడించారు.
