Sudigali Sudheer | బుల్లితెరపై అపారమైన క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్, హోస్ట్ సుడిగాలి సుధీర్ పెళ్లి విషయంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షోతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సుధీర్, ఆ తర్వాత అనేక రియాలిటీ షోల హోస్ట్‌గా యూత్‌లో పెద్ద ఫాలోయింగ్ సంపాదించాడు. 40 ఏళ్లకి దగ్గరగా వస్తున్న సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో, పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో ఆయన ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడన్న వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆ రూమర్స్‌ను ఇద్దరూ పలు మార్లు ఖండించారు. తాజాగా ‘స రి గ మ ప లిటిల్ జూనియర్స్’లో సుధీర్ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
జడ్జ్‌గా ఉన్న ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, సుధీర్ కోసం ఓ ఫన్నీ శుభలేఖ చదవగా ప్రతి ఒక్కరు పగలబడి నవ్వారు.. “మరో రెండు సంవత్సరాల్లో 42 ఏళ్లకి చేరబోతున్న మా వృద్ధ చిన్నారి, వృద్ధ వరుడు, పింఛన్‌ధారుడు సుధీర్ గారికి పెళ్లి నిశ్చయించాం! వధువు ఎవరో కాదు… సుధీర్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఇంకో సుధీర్ కావాలి కాబట్టి… వధువు కూడా సుధీరే!” అని అనంత శ్రీరామ్ శుభలేఖ చదివారు. ఇప్పుడు ఈ ప్రోమో వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండడంతో నెటిజన్స్ కూడా క్యూట్ కామెంట్స్ చేశారు. ఈ ఎపిసోడ్‌కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ ప్రమోషన్స్ కోసం హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సుధీర్‌పై ఫన్నీ పంచులు, పెళ్లి ఎపిసోడ్‌తో ఆ షో పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది.
గతంలో ఒక షోలో సుధీర్ మాట్లాడుతూ తాను ఒక అమ్మాయిని చాలా ప్రేమించానని, కానీ ఆమె వేరొకరిని వివాహం చేసుకున్న తర్వాత ఆ షాక్ నుంచి బయటపడలేక బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పిన విషయం అప్పట్లో పెద్ద చర్చైంది. ప్రస్తుతం సుధీర్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. G.O.A.Tలో దివ్యభారతితో కలిసి నటించగా, ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హైలెస్సో అనే చిత్రం చేస్తుండగా, ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. బుల్లితెరను దాటి సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు సుడిగాలి సుధీర్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.
