Ticket Rates | ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ రేట్ల పెంపు అంశం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో నిర్మాతలు టికెట్ ధరలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఆశించిన లాభాలకంటే ఎక్కువ నష్టాలను తెచ్చిపెడుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. చిన్న లాభం కోసం చేసిన ప్రయత్నం పెద్ద కలెక్షన్లను దూరం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సినిమా ప్రేక్షకుడికి వినోదం అయితే, నిర్మాతకు అది వ్యాపారమే. వందల కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు లాభాలు రావాలన్నది సహజమైన ఆశ. అందుకే టికెట్ ధరలు పెంచాలన్న డిమాండ్‌ను పూర్తిగా తప్పుబట్టలేం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే… ఆ ధరకు తగ్గ వినోదం ప్రేక్షకుడికి అందుతోందా? అనే అంశమే. ఖర్చు ఎంత పెట్టామన్నది కాదు, ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తృప్తిగా ఉన్నాడా లేదా అన్నదే అసలు లెక్క.
ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద సినిమాల విషయంలో ఇదే కీలక అంశంగా మారింది. టికెట్ రేట్ల పెంపు కోసం చివరి నిమిషం వరకు అనుమతుల కోసం ఎదురుచూడటం, అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం వల్ల ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ప్రీమియర్ షోలు సరిగా పడకపోవడంతో మొదటి రోజే రావాల్సిన భారీ కలెక్షన్లు మిస్ అయిన ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ‘రాజా సాబ్’ విషయంలో కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్లు లేకపోవడం వల్ల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయినట్టుగా ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. హైదరాబాద్ వంటి కీలక మార్కెట్‌లో ప్రీమియర్లు ఉంటే సాధారణంగా భారీ వసూళ్లు వస్తాయి. అయితే టికెట్ రేట్ల హైక్ కోసం చేసిన ప్రయత్నాలు ఆ అవకాశాన్ని చేజార్చాయని విశ్లేషణ.
మరోవైపు, అభిమానులు టికెట్ ధరల పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వాలు కూడా హైక్‌లకు సానుకూలంగా స్పందించడం లేదు. కొన్ని సందర్భాల్లో కోర్టుల జోక్యం కూడా ఉండటంతో నిర్మాతలు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి వస్తోంది. చివరికి రేట్లు తగ్గించాల్సి రావడం, ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ చేయడం వల్ల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లపై నేరుగా ప్రభావం పడుతోంది. ట్రేడ్ వర్గాల మాటల్లో చెప్పాలంటే, టాక్ ఎలా ఉన్నా ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేస్తే కనీసం ప్రారంభ వసూళ్లు మాత్రం గ్యారెంటీగా వస్తాయి.
అయితే అన్ని సినిమాలకు ఒకే విధమైన ఫార్ములా పనిచేయదన్న విషయం కూడా ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. ‘పుష్ప 2’, ‘సలార్’, ‘ఓజీ’ లాంటి సినిమాలకు టికెట్ రేట్లు పెరిగినా పెద్దగా విమర్శలు రాలేదు. ఎందుకంటే ఆ సినిమాల్లో అభిమానులు కోరుకునే కంటెంట్ ఉంది. అదే సమయంలో కొన్ని ఇతర సినిమాలకు రేట్లు పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కారణం కంటెంట్‌పై ప్రేక్షకుల నమ్మకం లేకపోవడమే. అంటే, టికెట్ ధర పెంపు అనేది కేవలం హీరో స్టామినా మీద కాకుండా, సినిమా కంటెంట్ మీద ఆధారపడాలని ట్రేడ్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తక్కువ టికెట్ రేట్లతో వచ్చిన చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమవుతున్నాయి. గతేడాది ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి సినిమాలు రూ.99 టికెట్ రేటుతో విడుదలై మంచి స్పందన పొందాయి. అలాగే నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్‌లు వంద రూపాయల టికెట్ ఆఫర్ ఇచ్చిన రోజున దేశవ్యాప్తంగా లక్షల మంది థియేటర్లకు రావడం నిర్మాతలకు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది. రేట్లు అందుబాటులో ఉంటే, సగటు టాక్ ఉన్న సినిమాకూ ప్రేక్షకులు వచ్చే అవకాశముంది.
మొత్తానికి, టికెట్ రేట్లు పెంచితే ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్లు రావచ్చు. కానీ లాంగ్ రన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిక ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్ బదులు ఓటీటీలను ఎంచుకునే ధోరణి పెరుగుతోంది. కనుక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు టికెట్ రేట్ల విషయంలో కేవలం తక్షణ లాభం కాకుండా, దీర్ఘకాలిక ప్రేక్షకుల అలవాట్లను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నది సినీ వర్గాల స్పష్టమైన అభిప్రాయం.
