Shiva Jyothi | యాంకర్ శివజ్యోతి ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్‌లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. “తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం… రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని చేసిన కామెంట్ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అవమానించడమేనని హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన విమర్శలు, ట్రోలింగ్ జరగడంతో వెంటనే క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శివజ్యోతి ఓ వీడియో విడుదల చేస్తూ, తిరుమల ప్రసాదం గురించి తన మాటలు చాలా మందికి తప్పుగా అనిపించాయి కాబట్టి ముందుగా హర్ట్ అయిన వారందరికీ క్షమాపణలు చేస్తున్నానని తెలిపింది.
తాను “రిచ్” అని అన్నది రూ.10,000 ఎల్1 క్యూలో నిలబడటాన్ని ఉద్దేశించినదేనని, భక్తి లేదా ప్రసాదాన్ని అవమానపరచాలన్న ఉద్దేశ్యం ఎప్పుడూ లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఏ వివరణ ఇచ్చినా తన తప్పును దాచుకునే ప్రయత్నంలా అనిపిస్తుందని, అందుకే పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం లేదని, తనతో పాటు తమ్ముడు సోను తరపున కూడా క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపింది. వెంకటేశ్వర స్వామిపై తనకు అపారమైన భక్తి ఉందని, తన ఇంట్లోనూ, చేతిపైనూ స్వామి ఉన్నారని, తన జీవితం మొత్తాన్ని మార్చింది స్వామినేనని, అలాంటప్పుడు ఆయన గురించి తాను తప్పుగా మాట్లాడే ప్రసక్తే లేదని పేర్కొంది. తాను అన్ని మతాల దేవుళ్లను గౌరవిస్తానని, తెలియక పొరపాటున మాటలు బయటకు వచ్చాయని, కేసులు పెడతామన్న భయంతో కాదు, తనకే కూడా ఆ మాటలు పలకకూడదన్న భావన కలిగిందని ఈ వీడియో పెట్టినట్లు తెలిపింది.
చివరగా టీటీడీ సభ్యులు సహా తన మాటలతో బాధపడిన ప్రతి ఒక్కరికీ మరోసారి క్షమాపణలు చెబుతూ, ఇలాంటి తప్పు ఇక మళ్లీ జరగదని హామీ ఇచ్చింది. అయితే శివజ్యోతికి సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. భవిష్యత్తులో శివజ్యోతి శ్రీవారి దర్శనం చేసుకోకుండా టీటీడీ ఆమె ఆధార్ కార్డ్ బ్లాక్ చేసినట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ న్యూస్ చూసిన హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే నెటిజన్స్ తగిన శాస్తి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
