వంకాయ కూర‌కు 4,000 ఏండ్ల చ‌రిత్ర‌..? ప్ర‌పంచంలోనే ఇది ఓల్డెస్ట్ క‌ర్రీ..!

వంకాయ కూర‌కు దాదాపు 4,000 ఏండ్ల చ‌రిత్ర ఉంది. వంకాయ‌కు భార‌త‌దేశ‌మే పుట్టినిల్లు. ఇక ప్రాచీన కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది ఈ శాకరాజం. వంకాయ‌ను కూర‌ల‌కు రారాజుగా పిలుస్తారు. అంత‌టి చ‌రిత్ర క‌లిగి ఉన్న వంకాయ ప్ర‌పంచ వ్యాప్త‌మైంది.

  • Publish Date - April 5, 2024 / 08:19 AM IST

వంకాయ వంటి కూరయు.. అంటూ ఆనాటి పద్యాల్లో చెప్పినా.. ఆహా ఏమి రుచి తినరా మైమరచి.. అంటూ ఇప్పటి సినిమాల్లో పాటగా పాడినా వంకాయ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. వంకాయ కూర‌ను అనేక ర‌కాలుగా వండుకుని ఆర‌గించేస్తుంటారు. గుత్తొంకాయ అంటే చాలా మందికి మ‌హా ఇష్టం. గుత్తొంకాయ కూర‌ను లొట్టలేసుకుంటూ కడుపు నిండా తింటారు.

మ‌రి అంత‌టి ఘ‌న‌మైన వంకాయ కూర‌కు దాదాపు 4,000 ఏండ్ల చ‌రిత్ర ఉంది. వంకాయ‌కు భార‌త‌దేశ‌మే పుట్టినిల్లు. ఇక ప్రాచీన కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది ఈ శాకరాజం. వంకాయ‌ను కూర‌ల‌కు రారాజుగా పిలుస్తారు. అంత‌టి చ‌రిత్ర క‌లిగి ఉన్న వంకాయ ప్ర‌పంచ వ్యాప్త‌మైంది. తొలిసారిగా వంకాయ‌.. ఇండియా నుంచి చైనా వైపు ప‌య‌నించిన‌ట్లు ప‌రిశోధ‌కుల అభిప్రాయం. ఇక చైనా నుంచి ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల‌కు వంకాయ విస్త‌రించిన‌ట్లు ప‌రిశోధ‌క‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచంలోనే ఈ వంకాయ కూర ఓల్డెస్ట్ క‌ర్రీ అని ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు.

ఈ వంకాయ వంట‌కం హ‌ర‌ప్ప‌న్ కాలం నాటిద‌ట‌..! మ‌రి హ‌ర‌ప్ప‌న్లు వంకాయ కూర తినేవారా..? అనే సందేహం మీకు రావొచ్చు. అయితే హ‌ర‌ప్ప‌న్లు వంట‌ల పుస్త‌కాలు రాయ‌లేదు కానీ.. వారు వంట‌ల‌కు ఉప‌యోగించిన పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకుని.. వారు ఏం వంట‌కాలు ఆర‌గించారో తెలుసుకున్న‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. హరప్పా నాగరికత నగరమైన ఫర్మానాలోని ఒక ఇంటిలో దాదాపు 4,000 సంవత్సరాల క్రితం నాటి హ‌ర‌ప్ప మ‌ట్టిపాత్ర‌ల అడుగు భాగాల‌ను మైక్రోస్కోపుల సాయంతో నిశితంగా ప‌రిశీలించిన‌ప్పుడు.. అక్క‌డ ర‌సాయ‌న అవ‌శేషాల‌ను విశ్లేషించినప్పుడు ఆ కాలంలో వాడిన మ‌సాలాలు, దినుసుల గురించి తెలిసింద‌ట‌. నాటి సంప్ర‌దాయ వంట‌కాల‌ను ప‌రిశీలించి, ప‌రిశోధ‌న వ్యాసాల‌ను క్షుణ్ణంగా ప‌రిశోధించిన త‌ర్వాత ఆనాటి వంట‌కం వంకాయ అని తేల్చార‌ట‌.

మరి వంకాయ వ‌ల్ల లాభాలు ఎన్నో తెలుసా..?

చూడ‌డానికి ఊదా రంగులో ఉండి నిగ‌నిగ‌లాడే వంకాయ‌.. ఆహార ప్రియుల‌ను ఆక‌ర్షించేస్తోంది. ఈ కూర రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఎన్నో పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. వంకాయ కూర‌ను తిన‌డంతో మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది. వంకాయ ద్వారా ల‌భించే ఫైటో న్యూట్రియంట్స్, పొటాషియం మీ మెద‌డుకు ఆక్సిజ‌న్‌ణు సక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఆంతోసైయానిన్లు అధికంగా ఉండడం వ‌ల్ల క్యాన్స‌ర్‌ను కూడా నిరోధిస్తుంది. ఈ కాయ తొడిమ‌లో క‌నుగొన్న సోల‌సొడైన్ రహ్మ్నోసిల్ గ్లైకోసైడ్‌లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను రూపుమాప‌గ‌ల‌వు. అందుకే ఈ కాయలను తొడిమలతో సహా తీసుకోవడం మంచిది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది వంకాయలో ఉన్న అంతోసియానిన్ అనే పిగ్మెంట్ వ‌ల్ల గుండె ప‌నిత‌నం మెరుగ‌వుతుంది. అంతేకాక‌, ఇందులో దొరికే ఐర‌న్‌, కాల్షియం ఎముక‌లు ఆరోగ్యంగా ఉండ‌టానికి తోడ్ప‌డుతుంది. వంకాయలో కార్బోహైడ్రేట్‌లు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండి, బ‌రువు త‌గ్గేందుకు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Latest News