Memory Loss | తరచుగా మరిచిపోతున్నారా..

పని ఒత్తిడి వల్ల కార్టిసాల్ పెరిగితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. వ్యాయామం, యోగా, ధ్యానం జీవనశైలి మార్పులు పరిష్కారమని నిపుణుల సూచన.

Memory Loss

ఒకపక్క ప్రాజెక్ట్ డెడ్ లైన్లూ, మరోపక్క ఇంట్లో పనులూ.. ఇలా రోజంతా పనితో సతమతం అవుతోంది ఐటీ ఉద్యోగిని అనిత. ఇల్లూ, ఆఫీసూ బ్యాలెన్స్ చేసుకోలేక పని ఒత్తిడిలో తలమునకలై ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా తరచుగా మరిచిపోతోంది. పని ఒత్తిడిలో ఇది సాధారణమే అని మొదట్లో చాలా లైట్‌గా తీసుకుంది. కానీ క్రమంగా ప్రెజెంటేషన్‌లో ముఖ్యమైన పాయింట్లు మరిచిపోవడం, రాత్రి నిద్ర పట్టకపోవడం మొదలయ్యాయి. డాక్టర్‌ దగ్గర పరీక్షలు చేయించుకున్నాక తెలిసింది.. ఆమెకు కార్టిసాల్‌ స్థాయి తీవ్రంగా పెరిగిపోయిందని.

అధిక కార్టిసాల్‌ మెదడు కణాలను నిశ్శబ్దంగా చంపేస్తూ… జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుందని తాజా శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు స్ట్రెస్‌లో ఉండటం వలన శరీరంలో ‘కార్టిసాల్‌’ అనే హార్మోన్‌ అధికంగా విడుదల అవుతుంది. తాత్కాలికంగా ఇది ఉపయోగపడినప్పటికీ, ఎక్కువ కాలం ఇలా కొనసాగితే మన మెదడు నిర్మాణాన్నే దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కార్టిసాల్ అంటే…

శారీరరకంగా గానీ, భావోద్వేగపరంగా గానీ స్ట్రెస్ కి గురైనప్పుడు అడ్రినల్ గ్రంథులు ఈ కార్టిసాల్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. ఇది మెటాబలిజం, బ్లడ్ షుగర్ స్థాయి, రక్తపోటు, రక్షణ వ్యవస్థపై సహాయక పాత్ర పోషిస్తుంది. స్ట్రెస్ తాత్కాలికంగా ఉన్నప్పుడు కార్టిసాల్ మనలో శక్తిని, ఫోకస్ ని మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. దీని స్థాయి పెరిగితే మాత్రం సమస్యలు మొదలవుతాయి.

కార్టిసాల్‌ ఎక్కువైతే…

• జ్ఞాపకాలకు సంబంధించిన కీలక భాగమైన హిప్పోకాంపస్ పరిమాణం చిన్నగా అయిపోతుంది.
• కొత్త నాడీకణాలు పుట్టే ప్రక్రియ మందగిపోతుంది. దీంతో నేర్చుకునే సామర్థ్యం, గుర్తుంచుకునే శక్తి తగ్గిపోతాయి
• కార్టిసాల్‌ స్థాయి పెరిగితే నిద్రలో సమస్యలు వస్తాయి. తద్వరా జ్ఞాపకశక్తి మరింతగా క్షీణిస్తుంది.
• దేని మీదా సరిగా దృష్టి పెట్టలేకపోతారు. ఫోకస్‌ లోపిస్తుంది.
మధ్య వయసు వ్యక్తుల్లో కార్టిసాల్‌ స్థాయి అధికంగా ఉంటే మెదడు పరిమాణం తగ్గిపోతున్నట్టు ఈ అధ్యయనాల్లో గమనించారు. డిమెన్షియా లాంటి వ్యాధి ఏమీ లేకపోయినప్పటికీ వారిలో జ్ఞాపకశక్తి      తగ్గుతుందని ఈ పరిశోధనల్లో తేలింది.

పరిష్కారం?

శాస్త్రవేత్తల ప్రకారం, జీవనశైలిలో మార్పులు తీసుకొస్తే కొంతవరకు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

• ప్రతిరోజూ వ్యాయామం చేయడం
• రోజూ 30 నిమిషాల పాటు ధ్యానం, యోగా
• సమయం ప్రకారం మంచి నిద్ర పోవడం
• సంతులిత ఆహారం తీసుకోవడం
• ఆఫీస్‌లో పని విరామాల మధ్య చిన్న వాకింగ్
• స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్

ఇవన్నీ పాటిస్తే కార్టిసాల్‌ స్థాయిలు క్రమంగా తగ్గి, మెదడు మళ్లీ ఆరోగ్యంగా మారే అవకాశం ఉంటుంది.

స్ట్రెస్‌ను లైట్‌గా తీసుకుంటే అది మన మెదడును నిశ్శబ్దంగా తినేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉద్యోగం, వ్యక్తిగత జీవితం ఎంత బిజీ అయినా, రోజులో కొంత సమయం మనసు–మెదడు ఆరోగ్యానికి కేటాయించడం తప్పనిసరి. రోజువారీ ఒత్తిడిని వదిలించుకోవడం, జీవనశైలిని సమతుల్యం చేయడం మన జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం కాపాడటానికి అత్యంత అవసరం.