Health Tips | అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాలు మీ కోసమే..!

Health Tips : ఆయుర్వేదం మనిషికి మార్గదర్శనం చేస్తుంది. భోజనం ఎలా తీసుకోవాలనే విషయంలోనూ కీలక సూచనలు చేసింది. నిజానికి మనిషి బతికేది తినడానికే, బతుకుతున్నది తిన్నందుకే. కాబట్టి ఆహారం విషయంలో నియమాలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

  • Publish Date - April 15, 2024 / 07:39 AM IST

Health Tips : ఆయుర్వేదం మనిషికి మార్గదర్శనం చేస్తుంది. భోజనం ఎలా తీసుకోవాలనే విషయంలోనూ కీలక సూచనలు చేసింది. నిజానికి మనిషి బతికేది తినడానికే, బతుకుతున్నది తిన్నందుకే. కాబట్టి ఆహారం విషయంలో నియమాలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మనిషిలో జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే ఒక తొమ్మిది ఆయుర్వేద సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేద సూత్రాలు

1. ఆకలితో ఉన్నప్పుడే తినాలి : భోజనం టైమ్‌ అయ్యింది అన్నట్టుగా కాకుండా నిజంగా ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి లేకున్నా తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు తప్పవు.

2. ఎక్కడపడితే అక్కడ తినొద్దు : హడావిడిగా ఎక్కడపడితే అక్కడ నిలబడి కాకుండా.. ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశంలో కూర్చుని తినాలి. టీవీ చూస్తూనో, పుస్తకం చదువుతూనో, ఫోన్, ల్యాప్‌టాప్ లాంటివి వాడుతూనో అస్సలు భోజనం చేయకూడదు. అలా చేయడంవల్ల తిన్న ఆహారం ఒంటికి పట్టదు.

3. సరైన మోతాదులో తినాలి : కొంతమంది కూర రుచి ఎక్కువగా ఉన్న రోజు ఎక్కువగా, కూర కమ్మగాలేని రోజు తక్కువగా తింటారు. ఇలా ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ తినడంవల్ల జీర్ణవ్యవస్థ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీ శరీరానికి తగ్గట్టుగా రోజూ తినేంతనే తినాలి.

4. వేడివేడిగా తినాలి : ఆహారం ఎప్పుడైనా వేడివేడిగా, తాజాగా ఉన్నప్పుడే తినాలి. సమయం లేదని మూడు పూటలకు ఒకేసారి వండుకోవడం, మిగిలింది ఫ్రిజ్ లో దాచుకుని తినడం లాంటివి చేస్తే జీర్ణశక్తి దెబ్బతింటుంది. వేడివేడిగా తినడంవల్ల జీర్ణాశయంలో ఎంజైమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి.

5. నాణ్యమైన ఆహారం తినాలి : ఎప్పుడైనా నాణ్యమైన భోజనం మాత్రమే చేయాలి. మీ భోజనంలో రసం, మజ్జిగ లాంటివి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే పోషక శోషణను మెరుగుపరుస్తాయి. కాబట్టి పొడిగా, గట్టిగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.

6. పడనివి తినొద్దు : కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడవు. ఉదాహరణకు పాలు తాగడంవల్ల కొందరికి, చేపలు తినడంవల్ల ఇంకొందరికి, వంకాయ, గోంగూరవల్ల మరికొందరికి ఇలా సమస్యలు వస్తుంటాయి. దీన్నే ఫుడ్ అలర్జీ అంటారు. కాబట్టి మీకు ఏదీ పడుతుందో అదే తినండి.

7. ఆస్వాదిస్తూ తినాలి : ఏదో ఆకలిమంటక ఆదరాబాదరాగా అన్నట్టు కాకుండా భోజనం చేయడానికి కూడా మనలోని ఐదు ఇంద్రియాలను ఉపయోగించాలి. అంటే ఆహారం వాసనను, తినే ప్లేట్‌ రూపాన్ని, తింటున్న ఆహారం తాజాదనాన్ని, దానిలో విభిన్న రుచులను ఆస్వాదిస్తూ సంతృప్తిగా భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

8. బాగా నమిలి తినాలి : సమయం లేదనో లేక అలవాటు ప్రకారమో చాలా మంది ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. సరిగా నమలని ఆహారం వల్ల మీ జర్ణవ్యవస్థపై మరింత ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

9. క్రమం తప్పకుండా తినాలి : టైమ్‌ లేదని లేక రుచిగా లేదని కొందరు ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు. అలా చేయడంవల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆహారం తినడమే కాక.. వీలైనంత వరకూ రోజూ ఒకే సమయాన్ని మెయింటెయిన్‌ చేయడంవల్ల ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతుంది.

Latest News