Viral Inspirational Video | అన్నీ బాగున్నవాళ్లను మీకేమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగితే ఇక వరుసబెట్టి లిస్టు చదువుతారు. ఇలాంటి వాళ్లు చాలా మందే ఎదురై ఉంటారు. కానీ.. అప్పుడప్పుడు మనవీ సమస్యలేనా? అనిపించే స్ఫూర్తినిచ్చేవాళ్లు కూడా తారసపడుతూ ఉంటారు. అలాంటి ఒక స్ఫూర్తిదాయని బాలీవుడ్ నటి, మోడల్ మల్లికా అరోరాకు ఎదురయ్యారు. ఆ అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు.
ఆ వీడియోలో మల్లికా అరోరా ఒక మహిళతో మాట్లాడుతూ ఉంటారు. ఆమె వయసు 52 ఏళ్లు. ఆమె జెప్టో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. అదేమీ పెద్ద విశేషం కాదేమో అనిపిస్తున్నది కదూ! ఉంది.. చాలా విశేషమే ఉంది. ఆమెను గమనించిన మల్లిక.. ‘మీరు ఏం పని చేస్తుంటారు?’ అని ప్రశ్నించారు. దానికి ఆ మహిళ ‘నేను జెప్టోలో డెలివరీ ఏజెంట్ పని చేస్తున్నాను’ అని బదులిచ్చారు. ఈలోపు స్కూటర్‌పై వాకింగ్ స్టిక్ గమనించిన మల్లిక.. మీ కాళ్లకు ఏమైనా సమస్య ఉందా? అని అడిగారు. దీనికి ఆ మహిళ చెప్పిన సమాధానం విని మల్లిక ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ డెలివరీ ఏజెంట్ 50 శాతం హ్యాండీకాప్డ్! అవును.. అంతటి కష్టంలో ఉండి కూడా ఆమె తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. పేరేంటి అని అడిగితే.. వీణాదేవి అని బదులిచ్చారు. తన వయసు 52 ఏళ్లని, గత జూన్ నెల నుంచి ఈపనిలో ఉన్నానని తెలిపారు. అయితే.. ఈ వీడియో ఎప్పుడు తీశారనే విషయంలో క్లారిటీ లేదు.
ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన మల్లిక.. ‘మీకు ఎవరైనా సహాయం చేయాలంటే మిమ్మల్ని సంప్రదించడం ఎలా?’ అని అడిగారు. దానికి ఆమె.. నవ్వుతూ.. ‘ఇలా సాయం చేస్తే చాలు.. థ్యాంక్యూ’ అంటూ తనకేమీ ప్రత్యేక సహాయాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. అనంతరం కెమెరాను తనవైపు తిప్పుకొన్న మల్లిక.. ‘ఏదైనా చిన్న సమస్య ఉన్నా మనం ఎంత ఈజీగా చెబుతుంటామో కదా! అనిపించింది. ఇలాంటి వ్యక్తిని కలవడం నాకు జీవితంలో ఇదే మొదటిసారి. ప్లీజ్ గైస్.. స్టాప్ క్రయింగ్. లైఫ్ ఈ వెరీ ప్రీషియస్’ అంటూ వీడియోను ముగించారు. అన్నట్టు ఈ వీడియోకు ఆమె పెట్టిన క్యాప్షన్ ఏంటో తెలుసా? ‘ఆమె ఆర్డర్లు మాత్రమే అందించదు.. ఆమె స్ఫూర్తిని అందిస్తుంది:’ (She didn’t deliver an order… she delivered inspiration).. నిజమే కదా!!
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమెను అభినందిస్తూ నెటిజన్లు సందేశాలను వెల్లువెత్తించారు. ఆమె పనిచేస్తున్న జెప్టో సంస్థ సైతం స్పందించింది. ఆమె తమకు గర్వకారణమని పేర్కొన్నది. ఒక యూజర్.. హ్యాట్సాఫ్ టు యూ మామ్.. మహిళ తాను అనుకుంటే ఏ పని అయినా చేయగలదు’ అని రాశారు. మరొకాయన తాను గతంలో ఇటువంటి వ్యక్తిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఆ వ్యక్తికి 300 రూపాయలు ఇచ్చానని, అప్పుడు ఆ వ్యక్తిలో ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నారు. ఇంకొక యూజర్.. ఆమెకు ఎలాంటి సహాయాలు అవసరం లేదు.. అందుకే ఆమె పని చేయగలుగుతున్నారు. ఆంటీ.. మీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు’ అని ప్రశంసించారు.
Read Also |
Hindu marriage rituals | సనాతన ధర్మంలో ఉన్న పెళ్లిపద్ధతులేమిటి? భూతశుద్ధి వివాహం ఉందా?
IndiGo Crisis | ఇండిగో ఒత్తిడికే DGCA వెనక్కి తగ్గిందా? కొత్త భద్రతానియమాల ఉపసంహరణపై వివాదం
Outsourcing Employees | ఔట్‌సోర్సింగ్‌పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
