Ways to Boost Memory | జ్ఞాపకశక్తిని ఇలా పెంచుకోండి.. డిమెన్షియా, అల్జీమర్స్ రోగులకు సైంటిస్టుల సూచనలు

ఆరోగ్యకరమైన ఆహారం, సామాజిక సంబంధాలు పెంపొందించడం వంటి జీవన శైలి మార్పులు కాగ్నిటివ్ నైపుణ్యాలపై ప్రభావం చూపిస్తున్నాయని ఫ్లోరిడా అట్లాంటిక్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన తాజా పరిశోధన పేర్కొంటున్నది.

  • Publish Date - September 23, 2025 / 08:00 PM IST

Ways to Boost Memory | ఫ్లోరిడా అట్లాంటిక్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన తాజా పరిశోధన ప్రకారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, సామాజిక సంబంధాలు పెంపొందించడం వంటి జీవన శైలి మార్పులు కాగ్నిటివ్ నైపుణ్యాలపై ప్రభావం చూపిస్తున్నాయి. 65 సంవత్సరాల వయసు పైబడిన వారిలో సుమారు 70 లక్షల మంది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది 2060 నాటికి సుమారు 13 లక్షలకు చేరొచ్చు. అల్జీమర్స్ రావడానికి వయసు పై బడటం ముఖ్యమైన కారణం అయినప్పటికీ ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ చేయడం, మానసిక, సామాజిక ఆనందాల వంటి అంశాలు కొంతవరకు దీన్ని నివారించడానికి గానీ, ఎదుర్కోవడానికి గానీ ఉపయోగపడతాయని ఈ అధ్యయనం సూచిస్తున్నది. వ్యాయామం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల మెదడులోని హిప్పోక్యాంపస్ వంటి భాగాలు మెరుగుపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికాలో జరిగిన అధ్యయనంలో వయసు పైబడిన వ్యక్తుల్లో జీవనశైలి మార్పులు చేయడం వల్ల రెండు సంవత్సరాల్లో వాళ్లలో మెమరీ, ఆలోచనా సామర్థ్యం వంటి లక్షణాల అభివృద్ధి కనిపించింది. అదేవిధంగా ఫిన్లాండులో జరిగిన పరిశోధన ప్రకారం జీవనశైలి మార్పు.. గుండె సంబంధ సమస్యలు రిస్కు ఉన్నవాళ్లలో కూడా మంచి ఫలితాలు కనిపించాయి.

మెమరీ పెంచే జీవనశైలి మార్పులు..

సైంటిస్టుల సూచనల ప్రకారం నియమిత వ్యాయామం, మెడిటరేనియన్ లేదా డాష్ స్టైల్ డైట్ లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కాగ్నిటివ్ సామర్థ్యాలు, సామాజిక సంబంధాలు పెంపొందించే సందర్భాలు పెంచుకోవడం, మద్యపానపు అలవాట్లు, అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి కారకాలను నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుచుకుంటే అల్జీమర్స్ రిస్కు తగ్గుతుంది.

చేయాల్సినవి..

•ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కనీసం 40 నిమిషాల నడక, యోగా, స్విమ్మింగ్ వంటివి.
•ఎక్కువ పండ్లు, కూరగాయలు, తగినంత ప్రోటీన్లు, తక్కువ సోడియం, తక్కువ ప్రాసెస్‌ చేసిన ఆహారం వంటివి.
•మానసిక ఉత్సాహం, మేధో వ్యాయామాన్ని పెంచే పనులు చేయడం. పజిల్స్, చదువు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సృజనాత్మక పనులు చేయడం ద్వారా మెదడుకు వ్యాయామం అవుతుంది.
•ఒంటరితనం తగ్గించుకోవడం, కుటుంబం, స్నేహితులు, సంఘాలు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం.