భారతీయ యువతలో గుండెపోట్లకు రెండు ప్రధాన కారణాలు

భారతీయ యువతలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. అల్పాహారం మానేయడం, రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం ప్రధాన కారణాలు. డాక్టర్ బాబు ఎజుమలై సలహా

  • Publish Date - September 24, 2025 / 11:30 PM IST

భారత యువతీయువకుల్లో గుండె జబ్బులు, గుండెపోట్లు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల వయసు గల యువతీయువకులు కూడా ఈ ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఈ సమస్య మధ్యవయస్కులు, వృద్ధుల వరకే ఉండేది. ఇప్పుడు యువతలో కూడా వ్యాపిస్తోంది. ఈ మార్పు వెనక జీవన శైలి అలవాట్లు, ముఖ్యంగా క్రమశిక్షణ లేని ఆహార పద్ధతులే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి, చెన్నైలోని ఎంజిఎమ్ హెల్త్‌కేర్‌లో సీనియర్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఎజుమలై ఇటీవల ఇచ్చిన సమాచారం ప్రమాదఘంటికలు మోగిస్తోంది.

డాక్టర్ ఎజుమలై మాట్లాడుతూ, యువతలో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే రెండు ప్రమాదకరమైన ఆహార అలవాట్లు బ్రేక్‌ఫాస్ట్ మానేయడం మరియు రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. ఆశ్చర్యకరంగా, గుండె జబ్బు చరిత్ర లేని వారికీ ఈ అలవాట్ల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు అలవాట్లు ఎందుకు ప్రమాదకరమో ఆయన వివరించారు.

అల్పాహారం మానేయడం: గుండెకు ప్రమాదం

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం ఇప్పుడు యువతలోచాలా మందికి అలవాటయింది. తొందరగా పనికి వెళ్లడానికి ఇది బాగానేఉంటుంది కానీ, ఈ అలవాటు శరీరానికి హాని చేస్తుంది. డాక్టర్ ఎజుమలై చెప్పినట్లు, అల్పాహారం మానేస్తే హార్మోన్లు సమతుల్యత దెబ్బతింటుంది, రక్తపోటు పెరుగుతుంది ఇంకా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ధమనుల్లో కొవ్వు, కొలెస్టరాల్, కాల్షియం వంటివి పేరుకుపోయి, ఇరుకుగా మారి, రక్తప్రసరణ తగ్గిపోతుంది. “బ్రేక్‌ఫాస్ట్ మానేసే యువకుల్లో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. దీనివల్ల గుండెపోటు మరియు హార్ట్ ఫెయిల్యూర్ మరణాల ప్రమాదం 27 నుండి 35 శాతం ఎక్కువ” అని ఆయన వివరించారు. ఈ అలవాట్లను అలాగే కొనసాగిస్తే గుండె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుదని హెచ్చరించారు.

రాత్రి ఆలస్యంగా భోజనం: మరో ప్రమాదం

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మరో ప్రమాదకరమైన అలవాటు. డాక్టర్ ఎజుమలై సలహా ఏంటంటే, నిద్రకు 2 గంటల ముందే భోజనం చేయాలి. లేకపోతే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను అస్థిరపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ క్షీణించడంతో, గుండెకు నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడతాయి. రాత్రి భోజనం ఆలస్యమవడం వల్ల శరీరంలో ఆహారం సక్రమంగా జీర్ణం కాదు. ఇది గుండెపై ఇంకా ఒత్తిడి పెంచుతుందని ఆయన తెలిపారు.
డాక్టర్ ఎజుమలై గట్టిగా హెచ్చరించారు— ఈ రెండు అలవాట్లూ ఉంటే గనుక ప్రమాదం ఇంకా ఎక్కువ. గుండెపోటు తర్వాత కూడా సమస్యల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. నెల రోజుల్లోనే ప్రాణాపాయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, యువత ఈ అలవాట్లను వెంటనే మార్చుకోవాలని సూచించారు. ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవడం, రాత్రి భోజనం నిద్రకు 2 గంటల ముందే పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయన సలహా ఇచ్చారు.