Menstrual Bleeding | యుక్త వయసు వచ్చిన ప్రతి యువతికి నెలసరి వస్తుంది. ఈ నెలసరినే రుతుస్రావం అంటారు. రుతుస్రావం అనేది మూడు రోజుల నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతోంది. కొందరికి మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. ఇలా ఏడు రోజుల పాటు వచ్చే నెలసరిని హెవీ మెనస్ట్రల్ బ్లీడింగ్ అంటారు. అయితే ఈ సమయంలో అధికంగా బ్లీడింగ్ అవుతుంది. ఇలా అధికంగా బ్లీడింగ్ కావడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.
అధిక రుతుస్రావం సమయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ శానిటరీ ప్యాడ్‌లు ఉపయోగిస్తుంటారు. గంట గంటకు మారుస్తుంటారు. నిరంతరం ప్యాడ్స్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా శారీరకంగా బలహీనంగా మారుతారు. ఏ ఇతర పనులు చేయడానికి కూడా చేతకాదు.
అధిక రుతుస్రావానికి కారణం ఏంటి..?
అయితే అధిక రుతుస్రావానికి అనేక కారణాలు ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా అధిక రుతుస్రావం ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మీ గర్భాశయం యొక్క లైనింగ్ చిక్కబడుతుంది. తద్వారా అధిక రక్తస్రావానికి దారితీస్తుంది. గర్భాశయంలోని ట్యూమర్‌లు కూడా అధిక రక్తస్రావానికి కారణమవుతాయి. గర్భాశయం కండరాల గోడలో ఎండోమెట్రియల్ కణజాలం పెరిగినప్పుడు కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
అధిక రుతుస్రావం అనీమియాకు దారి తీస్తుంది..
అధిక రుతుస్రావం శారీరకంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తస్రావం అధికంగా జరగడం వల్ల శరీరంలో అలసట వస్తుంది. ఐరన్ లోపం వల్ల అనీమియాకు దారి తీస్తుంది. ఆందోళనకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో, బయట జరిగే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అధిక రుతుస్రావం ప్రతి నెల కొనసాగితే.. తక్షణమే డాక్టర్లను సంప్రదించాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రా సౌండ్, బ్లడ్ టెస్టులు చేయించుకుని, మెడికేషన్ ఫాలో అవ్వాలి. అవసరమైతే హార్మోన్ థెరపీ చేయించుకోవాలి. ఈ అధిక రుతుస్రావం అనేది చాలా తక్కువ మంది మహిళల్లో కనిపిస్తుంటుంది.