Site icon vidhaatha

High Blood Pressure | ఇలా చేస్తే సహజంగానే అదుపులోకి బీపీ

High Blood Pressure | హై బ్లడ్ ప్రెజర్ – మన సమకాలీన జీవనశైలిలో అత్యంత ఎక్కువ మందిలో కనిపించే సమస్య. అయితే, బీపీ నియంత్రణ మన పళ్ళెంలోనే దాగి ఉందంటున్నారు నిపుణులు. సరైన ఆహారం, తగిన అలవాట్లతో సహజంగా హైపర్‌టెన్షన్‌ను అదుపులో ఉంచవచ్చని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రక్తపోటును తగ్గించడంలో శాస్త్రీయంగా పరిశీలించబడిన టాప్ 10 ఫుడ్ ఐటమ్స్

  1. ఆకుకూరలు

బీట్‌రూట్‌, పాలకూర‌, మెంతికూర, కొయ్ గూర వంటి ఆకుకూరలు పొటాషియంతో సమృద్ధిగా ఉండటం వల్ల సోడియం ప్రభావాన్ని తక్కువ చేస్తాయి. తద్వారా రక్తనాళాలపై ఒత్తిడి తగ్గడానికి దోహదం చేస్తాయి. నాడీ వ్యవస్థ ఆరోగ్యంలో కూడా ఇవి తోడ్పడుతాయి.

  1. వెల్లుల్లి

ఇది ఒక సహజ యాంటీహైపర్ టెన్సివ్. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం వాసోడైలేషన్‌ను పెంపొందించి, రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు రెండు ముద్దల వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటు సహజంగానే తగ్గుతుంది.

  1. అరటి & బొప్పాయిపండు

పొటాషియం అధికంగా ఉండే ఈ పండ్లు బీపీ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అరటి రోజూ ఒకటి తీసుకోవడం, మధ్యాహ్నం బొప్పాయి తీసుకోవడం మంచి ప్రభావం చూపుతుంది.

  1. ఓట్స్

ఓట్స్ లో ఉండే బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు గుండెకు రక్షణ కలిగిస్తుంది.

  1. బాదం, వాల్‌నట్

ఈ డ్రై ఫ్రూట్స్ లో గుడ్ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, రక్తనాళాల పై ఒత్తిడిని తగ్గిస్తాయి.

  1. పెసరపప్పు, శనగలు

ఈ గింజలు ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియంతో నిండి ఉంటాయి. అధిక ప్రాసెస్డ్ ఫుడ్‌ వాడకాన్ని తగ్గించి, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు మెరుగుపడుతాయి.

  1. బెర్రీలు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలో ఉండే ఫ్లేవినాయిడ్లు రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు గలవిగా ఉండి శరీరంలోని ఇన్ ఫ్లమేషన్‌ ను తగ్గిస్తాయి.

  1. తేనె – అల్లం

తేనెలో సహజ చక్కెరలు, అల్లంలో యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది గుండెకు మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది.

  1. చిరు ధాన్యాలు (జొన్న, సజ్జ, కొర్ర)

జొన్న, సజ్జ, కొర్రల వంటి చిరు ధాన్యాలలో సోడియం తక్కువగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అందువల్ల మిల్లెట్స్ ని తరచుగా తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.

  1. నీళ్లు

నీరు తక్కువగా తాగడం వల్ల రక్తం గట్టిపడుతుంది, ఇది బీపీకి కారణం కావచ్చు. అందుకే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.

హై బీపీకి మందులతో పాటు జీవనశైలి మార్పులు అత్యంత కీలకం. ముఖ్యంగా ఆహారపు అలవాట్లే దీని నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రకృతి మనకు ఇచ్చిన పోషకాల్ని తెలివిగా ఉపయోగించుకోవడం వల్ల బీపీని నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే.

Exit mobile version