ఛాతి నొప్పిని గుండె నొప్పి అని గుర్తించ‌డం ఎలా?

ప్ర‌తి ఏటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుండెనొప్పితో కొన్ని ల‌క్ష‌ల మంది చ‌నిపోతూ ఉన్నారు. గుండెనొప్పి రావ‌డానికి గ‌ల రిస్క్ కార‌కాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన లైఫ్ స్ట‌యిల్ పాటించ‌క‌పోవ‌డంతో పాటుగా, ఏది గుండెనొప్పి... ఛాతి నొప్పిని

  • Publish Date - April 27, 2024 / 03:32 PM IST

ప్ర‌తి ఏటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుండెనొప్పితో కొన్ని ల‌క్ష‌ల మంది చ‌నిపోతూ ఉన్నారు. గుండెనొప్పి రావ‌డానికి గ‌ల రిస్క్ కార‌కాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన లైఫ్ స్ట‌యిల్ పాటించ‌క‌పోవ‌డంతో పాటుగా, ఏది గుండెనొప్పి… ఛాతి నొప్పిని ఎప్పుడు సీరియ‌స్ గా తీసుకోవాల‌నే అంశంలో అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కూడా ఇందుకు కార‌ణ‌మే. చాలా సంద‌ర్భాల్లో పొట్ట‌లో గ్యాస్ పెరిగిపోయి, ఛాతి నొప్పిగా వ‌స్తోంద‌ని పొర‌పాటు ప‌డ‌టం వ‌ల్ల గుండెపోటును స‌కాలంలో గుర్తించ‌లేక‌పోతున్నారు. అందుకే గుండెనొప్పి సంకేతాల‌ను స‌రిగ్గా అర్థం చేసుకోవ‌డం అత్య‌వ‌స‌రం.

గుండెనొప్పికి గ‌ల సంకేతాల్లో ముఖ్య‌మైన‌ది ఛాతి నొప్పే. అయితే ఆ ఛాతి నొప్పి గుండెపోటు వ‌ల్ల వ‌చ్చేదా కాదా అని గుర్తించ‌గ‌ల‌గ‌డ‌మే కీల‌కం. ఛాతినొప్పితో పాటు ఇత‌ర రిస్క్ కార‌కాలు, ల‌క్ష‌ణాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఛాతిలో వ‌చ్చే నొప్పి గుండెపోటు వ‌ల్ల‌నో కాదో అర్థం చేసుకోవ‌చ్చు.

ఛాతి నొప్పి గుండెనొప్పి ఎప్పుడ‌వుతుంది?

గుండె నొప్పి అంటే మిగ‌తా శ‌రీర భాగాల్లో నొప్పి ఉన్న‌ట్టుగా ఉండ‌దు. ఛాతిలో గ‌ట్టిగా, ఏదో ప‌ట్టేసిన‌ట్టుండ‌టం, పిసికిన‌ట్టు అనిపించ‌డం లేదా భారంగా ఉండ‌టం లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. బ‌రువుగా, అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు గుండెలో మంట‌గా కూడా ఉంటుంది. చాలా సంద‌ర్భాల్లో గుండెనొప్పి కొన్ని నిమిషాలు ఉండి, వెళ్లిపోతుంది. దాని తీవ్ర‌త ఎక్కువ త‌క్కువ‌లు అవుతుంటుంది.
అయితే కొన్నిసార్లు ఛాతిలో తీవ్ర‌మైన‌ నొప్పి లేకుండా కూడా హార్ట్ అటాక్ రావొచ్చు. కొంత‌మందిలో ల‌క్ష‌ణాలు చాలా మైల్డ్ గా ల‌క్ష‌ణాలుంటాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు, పెద్ద‌వాళ్లు, డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్ల‌లో గుండెపోటు ల‌క్ష‌ణాలు సీరియ‌స్ గా క‌నిపించ‌క‌పోవ‌చ్చు.

• గుండెపోటుకి సంబంధించిన ఛాతి నొప్పి ముఖ్యంగా ఛాతి మ‌ధ్య భాగంలో లేదా ఎడ‌మ వైపు ఉంటుంది. అక్క‌డి నుంచి ఎడ‌మ చేతి వైపు నొప్పి పాకుతుంది. ద‌వ‌డ‌, మెడ‌, న‌డుము లేదా పొట్ట‌లోకి కూడా నొప్పి పాక‌వ‌చ్చు. ఛాతిలో మాత్ర‌మే నొప్పి ఉండాల‌ని లేదు. ఛాతి పై భాగాల‌కు కూడా పాకుతుంది. నొప్పితో పాటుగా ఈ కింది ల‌క్ష‌ణాలు కూడా ఉండొచ్చు.

• ఆయాసంతో ఊపిరాడ‌క‌పోవ‌డం,

• వికారం, వాంతి రావ‌డం,

• అజీర్తిగా ఉండ‌టం,

• క‌ళ్లు తిర‌గ‌డం,

• త‌ల తిప్పిన‌ట్టుండ‌టం,

• బ‌య‌ట ఎంత చ‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ విప‌రీత‌మైన చెమ‌ట రావ‌డం,

• అకార‌ణంగా నీర‌సంగా, బ‌ల‌హీనంగా ఉండ‌టం,

• తెలియ‌ని ఆందోళ‌న‌గా ఉండ‌టం

గుండెపోటు ల‌క్ష‌ణాలు కొన్నిసార్లు కొన్ని నిమిషాల క‌న్నా ఎక్కువ సేపు కూడా ఉండొచ్చు. మందులు వేసుకున్నా, విశ్రాంతి తీసుకున్నా త‌గ్గ‌క‌పోవ‌చ్చు.

ఇవీ ఉంటే..

వ‌య‌సుతో పాటు గుండెపోటు రిస్కు కూడా పెరుగుతుంది. కాబ‌ట్టి పెద్ద వ‌య‌సు వాళ్ల‌లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే అస్స‌లు అల‌క్ష్యం చేయొద్దు. మ‌హిళ‌ల క‌న్నా మ‌గ‌వాళ్ల‌లో రిస్కు ఎక్కువ‌. కానీ మెనోపాజ్ వ‌చ్చిన త‌ర్వాత మ‌హిళ‌ల్లో కూడా రిస్కు పెరుగుతుంది. కుటుంబంలో ఎవ‌రికైనా గుండెజ‌బ్బులున్న వాళ్ల‌లో రిస్కు ఎక్కువ‌. అధిక కొలెస్ట్రాల్‌, హైప‌ర్‌టెన్ష‌న్ (బీపీ) డ‌యాబెటిస్‌, పొగాకు అల‌వాటు, స్థూల‌కాయం లేదా బ‌రువు ఎక్కువ‌గా ఉండ‌టం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఆల్క‌హాల్ అల‌వాటు, స్ట్రెస్ ఎక్కువ‌గా ఉండ‌టం, మాన‌సిక కుంగుబాటు ఉన్నావాళ్ల‌లో గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌. కాబ‌ట్టి ఇలాంటి రిస్క్ కార‌కాలు ఉండి, పై ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే మెడిక‌ల్ అటెన్ష‌న్ తీసుకోవాలి.

Latest News