Jamun Health Benefits | ఊదా, నలుపు రంగుల మిశ్రమంతో మిలమిలా మెరిసే నేరేడు పండ్లు( Jamun Fruits ) ప్రస్తుతం ఎక్కడంటే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక నేరేడు పండ్లు చూడడానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ సీజన్‌లో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి( Health ) దివ్యౌషధమని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. ఈ పండ్లలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి నేరేడుపండ్లు తినడం వల్ల కలిగే ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
షుగర్ కంట్రోల్..
నేరేడు పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా పని చేస్తాయి. నేరేడు పండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో గ్లూకోజ్ లెవల్‌ను నియంత్రించడానికి దోహదపడుతుంది. నేరేడు పండ్ల విత్తనాలలో ఉండే జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయి. నేరేడు పండ్లలోని ఆంథోసైనిన్‌లు, ఎలాజిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు స్టార్చ్‌ను చక్కెరగా మారకుండా నిరోధించే సామర్థ్యం ఉంటుంది. తద్వారా ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గుండె ఆరోగ్యం
నేరేడు పండులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా నేరేడు పండ్లు పని చేస్తాయి. అంతేకాకుండా నేరేడు పండ్లు అనేవి కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కూడా తోడ్పడతాయి.
జీర్ణక్రియ మెరుగుదల
నేరేడు పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించి, పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఎక్కువగా డయాబెటిస్, హైపర్లిపిడెమియా, హైపర్‌టెన్షన్, ఊబకాయం మొదలైన వివిధ జీవక్రియ సమస్యలకు చికిత్స చేయడానికి ఔషధంగా ఉపయోగించబడుతుంది.
రక్తహీనత
నేరేడు పండ్లలో ఐరన్, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని తింటే మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.