Cancer In India | ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని ఓ పరిశోధనలో తేలింది. దేశంలో క్యాన్సర్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే, క్యాన్సర్ రకాలను ప్రాథమిక దశలోనే గుర్తించడంతో చాలావరకు నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. అలోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ నేషన్ పేరుతో రూపొందించిన నివేదికలో భారత్ ప్రపంచానికే క్యాన్సర్ రాజధానిగా పేర్కొన్నారు. 2020 నాటికి దేశంలో 1.4 మిలియన్ క్యాన్సర్ కేసులు ఉంటే.. 2025 నాటికి 1.57 మిలియన్లకు చేరే అవకాశాలున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
దీనిపై క్యాన్సర్ నిపుణురాలు ఇందు అగర్వాల్ స్పందించారు. దేశంలో పొగాకును కట్టడి చేస్తే చాలా క్యాన్సర్ కేసుల పెరుగదలను కట్టడి చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 267 మిలియన్ల మంది పొగాకును వినియోగిస్తుంటారన్నారు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్లకు పొగాకు కారణంగా పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తంగా మారిన జీవనశైలి కారణంగా క్యాన్సర్ ముప్పును పెంచుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్‌పై పోరాడేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. క్యాన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్ టెస్టులు చేయడంతో పాటు క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూర్చడం అవసరమని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.