గుట్కాతో దోస్తీ… క్యాన్సర్ తో కుస్తీ!
క్యాన్సర్ లాంటి భూతం లాంటి వ్యాధికి సర్జరీ ఫీజు కూడా తీసుకోకుండా విరాళాల మీద రిస్కుతో కూడిన ఆపరేషన్ చేయాలంటే ఎంతో నిబద్ధత కావాలి. ఎన్నో ఏళ్లుగా క్యాన్సర్ పై యుద్ధం చేస్తున్న డాక్టర్ చంద్రకాంత్ గురించి, ఆయన ఇటీవల చేసిన ఓ ఛాలెంజింగ్ సర్జరీ గురించి వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా..
“అంతా అయిపోయింది… ఎంత చెప్పినా వినకపాయే.. ఇప్పుడు మా బతుకులు ఆగమైపాయే. ఇప్పుడేం చెయ్యాలి దేవుడా….” అంటూ ఏడుస్తోంది శంకర్ భార్య. ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసే శంకర్ నోటి క్యాన్సర్ బారిన పడ్డాడు. నోటి నిండా కణితి… దానిలో పురుగులు… ఇక బతకడం కష్టమన్నారు డాక్టర్లు. అప్పుడొచ్చారాయన… ఆపద్బాంధవుడిలా.
ఆయనే… పొగాకు నివారణ, దానిపై అవగాహన కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్న ప్రముఖ దంత వైద్యులు, మాక్సిలోఫేషియల్ సర్జన్, మహావీర్ డెంటల్ విభాగాధిపతి డాక్టర్ చంద్రకాంత్ రావు బొట్టు.
ఆర్‌టీసీ డ్రైవర్ గా పనిచేసే శంకర్ విపరీతంగా పొగాకు నమిలేవాడు. ఎప్పుడో అలవాటైన గుట్కా వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తెలిసినా మానలేకపోయేవాడు. చివరికి ఆ పొగాకుకే బలైపోయే దుస్థితికి చేరుకున్నాడు. ఆందోళనలో ఆరోగ్యం… ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రం. సరదాగా మొదలైన గుట్కా వ్యసనం అతడిని, అతడి కుటుంబాన్ని బజారుకీడ్చింది. ఆర్థికంగా చితికిపోయి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో అతడి కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది.
అప్పుడు రంగంలోకి దిగారు డాక్టర్ చంద్రకాంత్. నాలుగున్నర లక్షల రూపాయల విరాళం సేకరించి, అతడికి ఆపరేషన్ చేసి… మూసుకుపోయిన నోటిని తెరవడంతో పాటు… పారిపోయే ప్రాణాలను నిలబెట్టారు. శంకర్ కుడి వైపు దవడ దగ్గర క్యాన్సర్ పూర్తిగా వ్యాపించడంతో నోరు తెరుచుకునేదే కాదు. నోటిలో క్యాన్సర్ ఏర్పడినప్పుడు అది మొత్తం నోటినే తినేస్తుంది. ఇతర అవయవాలకు వ్యాపించడం కన్నా ముందు ఇలా నోటి లోని భాగాలను దెబ్బతీస్తుంది. శంకర్ విషయంలో కూడా క్యాన్సర్ కణితి దవడ మొత్తాన్నీ తినేసింది. క్యాన్సర్ పుండులో పురుగులు కూడా ఏర్పడి, నోరు తెరవరాక శంకర్ చాలా కష్టం పడ్డాడు.
ఇప్పుడు ఈ ఆపరేషన్ ద్వారా పై దవడ, కింది దవడలను తొలగించారు. క్యాన్సర్ వల్ల నోటి లోపల ఏర్పడిన రెండు వందలకు పైగా పురుగులను తీసేసారు డాక్టర్ చంద్రకాంత్ బృందం. అయిదురోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన శంకర్ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు. అయితే అందరిలా తినడం మాత్రం సాధ్యం కాదు. గొట్టాల ద్వారా ద్రవాహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నారు. కానీ ప్రాణాపాయం తప్పి, ఇతరత్రా ఇబ్బందులన్నీ పోవడంతో శంకర్ ఇప్పుడు చలాకీగా ఉన్నాడు. అతడి భార్య, కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేవు.
ఈ నగరానికేమైంది..? అని ప్రశ్నించినా..
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం… అంటూ హెచ్చరించినా..
అది డాక్టర్ చంద్రకాంత్ కే చెల్లింది.
ఒకవైపు పేరున్న హీరోలూ, హీరోయిన్లూ… తమ సినిమాల ద్వారా పొగతాగడాన్ని ఫ్యాషన్ గా, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, స్టయిల్ కి సంకేతంగా చూపిస్తుంటారు. వాళ్లను గుడ్డిగా అభిమానించే వాళ్లంతా… గుప్పుగుప్పున పొగ వదిలితేనే హీరోలమైపోయినట్టు ఊహించుకుంటారు. సెలబ్రిటీల ద్వారా సిగరెట్లు, గుట్కాల వంటి వాటి ప్రకటనలతో అదరగొట్టే పొగాకు పరిశ్రమల ఉచ్చులో చిక్కుకుని అనేకమంది పొగాకు అనే విషవలయంలో చిక్కుకుని… చివరికి క్యాన్సరే గమ్యంగా ప్రయాణిస్తున్నారు.
డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రోద్బలంతో 1994లో స్కోప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, గత 30 ఏళ్లుగా పొగాకుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు డాక్టర్ చంద్రకాంత్. ఈ సంస్థ ద్వారానే పొగాకు రహిత సమాజం కోసం వంద కోట్ల సంతకాలను సేకరించారాయన. అందులో తొలి సంతకం డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాందే. ఆయన ప్రయత్నం వల్లనే అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన గ్లోబల్ హెల్త్ కాంగ్రెస్ లో పొగాకుకు వ్యతిరేకంగా అవగాహన పెంచడంలో భారత్ ముందుంటుందని, ట్రీటీపై సంతకం చేశారు. డాక్టర్ చంద్రకాంత్ ప్రయత్న ఫలితమే ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తున్న నో టొబాకో రీల్స్. అలా పొగాకును, మత్తు పానీయాలను ప్రోత్సహించే హీరోల తోనే పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం… అంటూ చెప్పించడంలో సఫలమయ్యారు డాక్టర్ చంద్రకాంత్.