Mir Alam Iconic Bridge : హైదరాబాద్ కు మరో ఐకానిక్..మీర్ ఆలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జి పనులు షురూ!

హైదరాబాద్‌కు మరో ఐకానిక్ వంతెనగా నిలవనున్న మీర్ ఆలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.319.24 కోట్లతో 2.5 కి.మీ పొడవున, 4 వరుసల రోడ్డుతో నిర్మితమవుతున్న ఈ వంతెనను గార్డెన్స్ బై ది బే స్ఫూర్తితో తీర్చిదిద్దనున్నారు.

New Ionic Bridge In Hyderabad

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ కు మరో ఐకానిక్ వంతెనగా నిలవబోతున్న మీర్ ఆలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని మీర్ ఆలం ట్యాంక్‌పై 2.5 కి.మీ పొడవైన వంతెనను నిర్మించాలని, దాని చుట్టూ మూడు ఐలాండ్ లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గార్డెన్స్ బై ది బే ప్రేరణతో అత్యంత ఆకర్షణీయంగా ఈ ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని తలపెట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు టెండర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ కేఎన్‌ఆర్ రూ. 319.24 కోట్లకు దక్కించుకుంది. మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. MRDCL ఇంజనీర్లు వంతెన నిర్మాణ పనులు చేపట్టారు.

2.5కిలో మీటర్లు పొడవు, 16.5మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో రోడ్డు, విశాలమైన కాలిబాటలతో వంతెన నిర్మాణం కానుంది. చింతల్‌మెట్ ప్రాంతాన్ని, శాస్త్రిపురం నుంచి సాగిపోయే బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తారు. ఈ వంతెన నిర్మాణంతో నగర పర్యాటకం అభివృద్ధితో, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మాదిరిగా రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థతో మీర్ ఆలం వంతెన కూడా ఐకానిక్ బ్రిడ్జిగా శోభాయమానంగా కనబడనుంది. కేవలం రవాణా మార్గంగానే కాకుండా, నగర పర్యాటకానికి ఈ వంతెన ఒక ముఖ్య కేంద్రంగా మారబోతుంది.

నిజాం సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన మీర్ ఆలం బహదూర్ పేరుతో 1806లో నిర్మించబడిన మీరాఆలం చెరువు సుమారు 450 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువుకు ఒకవైపు నెహ్రూ జూలాజికల్ పార్క్, మరోవైపు బెంగళూరు జాతీయ రహదారి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. ఈ వంతెన పూర్తయ్యాక సందర్శకుల రద్దీ పెరుగనుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

AI Teacher Robot : ఇంటర్ విద్యార్థి క్రియేషన్..రూ.25వేలతోనే ఏఐ రోబో!
Rising Telangana Global Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో

Latest News