New District | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిల్లాల పునర్విభజన!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, రంగారెడ్డి జిల్లాను అర్బన్–రూరల్‌గా విభజించే యోచనపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్ శివారులో ప్రతిపాదిత కొత్త జిల్లా పరిధిని చూపుతున్న తెలంగాణ మ్యాప్

Telangana Plans New District Within Greater Hyderabad Limits

విధాత సిటీ బ్యూరో | హైదరాబాద్​:

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలనా వ్యవస్థను మరింత సరళంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించింది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో, పోలీస్ పరిపాలనకు అనుగుణంగా రెవెన్యూ జిల్లాల హద్దులు కూడా ఒకేలా ఉండాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు మూడు జిల్లాలు మాత్రమే ఉండగా, నాలుగు పోలీస్ కమిషనరేట్లకు సరిపడేలా ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పునర్విభజనను 2027 జనగణనకు ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా భౌగోళిక, జనాభా, మౌలిక వసతుల వివరాలను సేకరిస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం 16 మండలాలతో ఉన్న హైదరాబాద్ జిల్లాలోని తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలను మల్కాజిగిరి జిల్లాలోకి మార్చాలని నిర్ణయించారు. అలాగే అమీర్‌పేట మండలంలోని కీలక ప్రాంతమైన బేగంపేటను కూడా మల్కాజిగిరి జిల్లాలో విలీనం చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా హద్దులు ఇప్పటివరకు బండ్లగూడ, బహదూర్‌పురం వరకు పరిమితమై ఉండగా, ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల వరకు విస్తరించనున్నాయి.

అయితే ఈ విస్తరణ మొత్తం కాకుండా, ఆయా మండలాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాలకే హైదరాబాద్ జిల్లా పరిమితమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూడా పూర్తిగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణకు లోనవుతుంది. రంగారెడ్డి జిల్లా నుంచి సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాలు ఈ జిల్లాలో కలవనున్నాయి. అయితే జీహెచ్‌ఎంసీ పరిధికి బయట ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్ మండలంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.

 రంగారెడ్డి జిల్లా రెండు ముక్కలుఅర్బన్, రూరల్‌గా విభజన

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాగా ఉన్న రంగారెడ్డి జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ కారిడార్, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఒకవైపు ఉండగా, గ్రామీణ స్వరూపం కలిగిన మండలాలు మరోవైపు ఉండటంతో పరిపాలనలో సమన్వయం కష్టమవుతోందన్నది అధికారుల అభిప్రాయం.

ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిని పూర్తిగా అర్బన్ జిల్లాగా, కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. రూరల్ జిల్లాలో షాద్‌నగర్, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం వంటి మండలాలు ఉండనున్నాయి. ఈ విభజనతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ALSO READ: నయా రాజకీయం…ఎన్నికల్లో చెప్పనవి చేస్తారు!

దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌసింగ్ సెన్సస్ నిర్వహించాల్సి ఉండటంతో, జనవరి మాసాంతంలోపే జిల్లాల పునర్విభజనపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. పోలీస్ స్టేషన్ పరిధి, జిల్లా పరిపాలనా హద్దులు ఒకేలా ఉండటం వల్ల ప్రజలకు సేవలు వేగంగా అందడమే కాకుండా, శాంతిభద్రతల నిర్వహణ కూడా మరింత పటిష్టంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, రంగారెడ్డి జిల్లాను అర్బన్–రూరల్‌గా విభజించే యోచనపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు అనుగుణంగా కొత్త జిల్లా ఏర్పాటుపై త్వరలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Latest News