విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్(84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) గురువారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వరకు 46రోజుల పాటు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రె డ్డిలు నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌కు ఈ ఏడాది దాదాపు 20 లక్షలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుంది. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. ప్రవేశ రుసుము రూ.50 ఉండనుంది. గత ఏడాది రూ.40 ఉండగా.. ఈసారి మరో 10 రూపాయలు ప్రవేశ రుసుము పెంచారు. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు మాత్రం ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ సుమారు 19 విద్యా సంస్థలను నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 30 వేల మంది విద్యార్థులకు చదువు, 2 వేల మంది సిబ్బంది ఉపాధి అందిస్తుండటం విశేషం.
ఎగ్జిబిషన్‌లో 1050 స్టాల్స్
ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో 1050 స్టాళ్లు ఉండనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్నచిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీలకు సంబంధించిన ఉత్పత్తుల స్టాల్స్ ఇందులో ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళలు, దుస్తులు, గృహోపకరణాలు, ఆభరణాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులు అందుబాటులో ఉంటాయి. అదనంగా సుమారు 20 ఫుడ్ స్టాల్స్‌లో వివిధ రకాల వంటకాలు, హైదరాబాదీ హలీం, స్వీట్స్, స్నాక్స్ అందిస్తారు. పిల్లలకు ఆకర్షణీయంగా జెయింట్ వీల్, ఇతర రైడ్స్ కూడా ఉంటాయి.
భారీ భద్రత ఏర్పాట్లు
ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల భద్రతకు భారీ ఏర్పాట్లు చేశారు. 106 మంది సెక్యూరిటీ సిబ్బంది గేట్ల వద్ద, మైదానంలో పర్యవేక్షిస్తారు. మెటల్ డిటెక్టర్‌ల తనిఖీలు, 120 సీసీటీవీ కెమెరాలతో పూర్తి మైదానం నిఘా పర్యవేక్షణలో ఉంటుంది. అగ్నిమాపక నివారణ యంత్రాలు, రెండు అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అవి ప్రతి ఒక్కటి 1.5 లక్షల లీటర్ల కెపాసిటీతో ఉన్నాయి. 82 ఫైర్ హైడ్రంట్స్, రెండు ఫైర్ ఇంజన్లు స్టేషన్‌లోనే ఉంటాయి. మహిళలు, వృద్ధులకు సహాయం కోసం 138 మంది డే వాలంటీర్లు, స్టాల్ హోల్డర్ల ఆస్తి భద్రతకు 76 మంది నైట్ వాలంటీర్లను అందుబాటులో నియమించారు.
ప్రత్యేక రవాణ ఏర్పాట్లు
నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే వారి కోసం మెట్రో రైల్ సర్వీసుల సమయం పెంచారు. గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్ల నుంచి ఫ్రీక్వెన్సీ పెంచి, టైమింగ్స్ పొడిగించారు. టీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 85 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ కేవలం ఓ పారిశ్రామిక ప్రదర్శనగానే కాకుండా దేశం నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతుల స్టాల్స్ తో ఆయా రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళన వేదికగా నిలుస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి :
Retirement Age 64 Years | ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 64?
Donald Trump : న్యూ ఇయర్ లో ట్రంప్ టార్గెట్ అదేనట!
