దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రదారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగంలో వాడిన రెండు పదాలు అభ్యంతరకరంగా ఉండడంతో విమర్శలు వచ్చాయి. దీనిపై యాంకర్ అనసూయ, గాయని చిన్మయి, దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించారు.
అయితే శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంలోకి హిందూ దేవుళ్లను తీసుకురావడం, హిందూవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయి. నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఖమ్మంతో పాటు విశాఖపట్నంలో సైతం అతనిపై కేసులు నమోదయ్యాయి.
దీంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. విదేశాల్లో ఉంటూ మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయడంతో పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశారు. అన్వేష్ ఐడీతో పాటు లాగిన్ వివరాలు సమర్పించాలని అందులో పేర్కొన్నారు. ఈ వివరాలతో అతడు ఏ దేశంలో ఉన్నాడు? ఎక్కడ ఉండి ఈ వ్యాఖ్యలు చేశాడు? లాంటి వివరాలు తెలుసుకోనున్నారు.
కాగా, శివాజీపై అన్వేష్ వ్యక్తిగత దూషణలు చేయడంతో పాటు హిందూ దేవుళ్లను అవమానపరిచేలా నీచంగా మాట్లాడినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. హిందువులే మానభంగాలు చేస్తున్నారని, హిందూత్వంలో స్వేచ్ఛ ఉండదని ఇష్టారీతిన చేసిన వ్యాఖ్యల పట్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతమ్మ, ద్రౌపదిపై చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని.. అతనికి పురాణాల పట్ల అవగాణ లేకుండానే నోటికి వచ్చినట్లు మాట్లాడాడంటూ ఫైర్ అయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు చేయడంతో పాటు సోషల్ మీడియాలో అతడిని అన్‌ఫాలో చేయాలని హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేశారు. దీంతో కొన్ని గంటల్లోనే అన్వేష్ లక్షల్లో ఫాలోవర్లను కోల్పోయాడు.
తప్పు తెలుకుని దిగివచ్చిన అన్వేష్.. క్షమించాలంటూ వేడుకుంటూ వీడియో రిలీజ్ చేసినా నెటిజన్లు కరుణించట్లేదు. అతడిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అయితే విదేశాల్లో ఉన్న అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అన్వేష్‌ను స్వదేశానికి ఎలా తీసుకొస్తారని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అతను ఉన్న దేశంలో అక్కడి చట్టాలకు లోబడి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? అతని పాస్‌పోర్ట్ రద్దు చేసి దేశానికి వచ్చేలా చేస్తారా? లేదా అతను ఇండియా వచ్చేవరకు వేచి చూస్తారా? అని సందిగ్ధం నెలకొంది.
ఇవి కూడా చదవండి :
MSG | సంక్రాంతికి మెగాస్టార్ సందడి .. పవర్ ఫుల్ పోస్టర్‌తో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్
Durgam Cheruvu | దుర్గం చెరువు కబ్జా జరిగిందిలా : బయటపెట్టిన హైడ్రా
