Students Protest | తెలంగాణ ఉన్నత విద్యామండలి ముట్టడి..ఉద్రిక్తత

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల కోసం బీసీ విద్యార్థి సంఘాల ముట్టడి.. విద్యామండలి ఎదుట ఉద్రిక్తత, విద్యార్థులు–పోలీసుల మధ్య తోపులాట.

Telangana Students Protest

విధాత, హైదరాబాద్ : ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ ఇప్పటికే విద్యా సంస్థల బంద్ కొనసాగుతుండగా..మరోవైపు విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. మంగళవారం బీసీ విద్యార్థి సంఘాలు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడించాయి. బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు తోపులాట సాగింది. ఈ సందర్బంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో విద్యార్థులు విద్యామండలి కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరసనకు దిగారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నిరసనలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వరి బోనస్, రైతు బంధు బకాయిలు, రుణమాఫీ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల బకాయిలతో ఇబ్బంది పెడుతుందన్నారు. చివరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రూ.11వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వమే ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం మంత్రులతో ఓ సబ్ కమిటీ వేసిందని..దసరాకు, దీపావళికి విడతల వారిగా చెల్లిస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. దీంతో కాలేజీలు నడపలేక యాజమాన్యాలు ఇబ్బందుల్లో పడ్డాయని, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు అడిగితే తనిఖీల పేరుతోవారిని బెదిరిస్తందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు ఉదృతమవుతాయని హెచ్చరించారు.