Site icon vidhaatha

Landslide | కొండచరియలు విరిగిపడి 2000 మంది సజీవ సమాధి

పపువా న్యూగినియాలో ప్రకృతి బీభత్సం

పోర్ట్‌ మోర్స్‌బే: పపువా న్యూగినియాలో దారుణం చోటు చేసుకున్నది. కొండచరియలు విరిగి పడటంతో 2వేల మందికిపైగా సమాధి అయ్యారని అధికారవర్గాలు సోమవారం తెలిపాయి. శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనతో ఎన్‌గా ప్రావిన్స్‌లోని కొండల్లో ఉన్న గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ‘కొండచరియలు విరిగిపడటంతో రెండు వేల మందికిపైగా సజీవ సమాధి అయ్యారు. భవనాలు, ఆహార పంటలకు తీవ్ర నష్టం జరిగింది. దేశ ఆర్థిక జీవనాడిపై ఇది పెను ప్రభావం చూపుతుంది’ అని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌.. పోర్ట్‌ మోర్స్‌బేలోని ఐరాస కార్యాలయానికి తెలిపింది.

అత్యంత ప్రమాదకర పరిస్థతులను సాహసంతో ఎదుర్కొంటున్న సహాయ సిబ్బంది.. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని వెతుకుతున్నారు. తమ దేశం నుంచి సహాయాన్ని పంపిస్తున్నట్టు ఆస్ట్రేలియా ఉప ప్రధాన మంత్రి రిచర్డ్‌ మార్లెస్‌ ప్రకటించారు. ‘మా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తుల వేళ వారు మాకు సహకరించారు. అదే ఉదార స్వభావాన్ని ఇప్పుడు మేం చాటుకోదలిచాం’ అని ఆస్ట్రేలియా అధికార బ్రాడ్‌కాస్టర్‌ ఏబీసీకి సోమవారం చెప్పారు. ఇప్పటికీ కొండ చరియలు విరిగిపడుతూనే ఉన్నాయని, పరిస్థితి భయానకంగా ఉన్నదని ఐరాస మైగ్రేషన్‌ ఏజెన్సీ అధికారి సెర్హాన్‌ అక్టోప్రాక్‌ ఆదివారం తెలిపారు.

తొలుత 100 మంది నుంచి 300 మంది వరకూ సజీవ సమాధి అయి ఉంటారని తొలుత భావించినా.. తదుపరి ఆ సంఖ్య రెండువేలకుపైగానే ఉన్నట్టు సహాయ సంస్థలు తెలిపాయి. ఈ గ్రామంలో సుమారు 4వేల మంది వరకూ నివసిస్తున్నట్టు అంచనా. ఇక్కడి ఎత్తయిన ప్రాంతాల్లో ఒండ్రుమట్టి నుంచి బంగారం సేకరిస్తుంటారు. అలాంటివారికి ఇది కేంద్రంగా ఉన్నది. ఈ ఘటనతో మరో వెయ్యి మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఆహార పంటలు, మంచినీటి సరఫరా వ్యవస్థలు దాదాపు నాశనమయ్యాయి. మూడు నుంచి నాలుగు ఫుట్‌ బాల్‌ మైదానాల పరిమాణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతాన్ని కలిపే ప్రధాన రహదారితో సంబంధాలు తెగిపోయాయి.

Exit mobile version