Arunachal Pradesh | విధాత : అకస్మాత్తుగా విరిగి పడిన కొండ చరియలు రహదారిపై భీభత్సం సృష్టించాయి. ఆకాశం నుంచి భారీ బండరాళ్ల వర్షం ఏదైనా పడుతుందా అన్నట్లుగా కొండపై నుంచి విరిగి పడిన బండరాళ్లు దొర్లుకుంటూ రోడ్డుపైన వెలుతున్న వాహనదారులపై పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh) పశ్చిమ కామెంగ్ జిల్లా(West Kameng district) సప్పర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా వర్షాలతో కొండలపై ఉన్న భారీ బండరాళ్లు విరిగి పడి కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చి రోడ్డు మీదుగా వెలుతున్న వాహనాలపై పడ్డాయి. వాహనదారులు సకాలంలో అప్రమత్తం కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
అయితే ఈ ఘటనలో రెండు వాహనాలు రాళ్ల ధాటికి ధ్వంసమయ్యాయి. దిరాంగ్, తవాంగ్ గ్రామాల(Dirang and Tawang) మధ్య భారీ స్థాయిలో కొండచరియాలు విరిగి పడటంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారీ వర్షాల సందర్భంగా ఎతైన ప్రాంతాల్లోని కొండచరియాలు విరిగిపడుతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. అధికారులు ముందస్తుగా చాలా ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశారు.