సంగీతానికి ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి ఉందంటే వినడానికి నమ్మశక్యంగా ఉండదు. కానీ ఓ దేశ పార్లమెంటులో ఎంపీ పాడిన పాట ఇప్పుడు ప్రపంచంలోని నెటిజన్లను ఊపేస్తోంది. న్యూజిలాండ్ (New Zealand) లో 170 ఏళ్ల తర్వాత పార్లమెంటుకు ఎంపికైన అతి పిన్న వయస్కురాలు హనా రవ్‌హీతి మైపీ క్లార్కె. ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. క్లార్కె న్యూజిల్యాండ్‌లోని ఒక ప్రత్యేకమైన తెగకు చెందిన వ్యక్తి. ఆ తెగ హకా (Haka) అనే పేరుతో పిలిచే ఒక జానపద యుద్ధ నృత్యాన్ని చేస్తారు. ఇది మన దగ్గర ఉన్న భూతకోలా, లేదా పూనకం వంటి వాటిల్లా ఉంటుంది.
మహోగ్ర రూపంతో చేతులతో, మొహంతో వివిధ హావభావాలను ప్రదర్శిస్తూ విరామం లేకుండా సాగిపోయే పాటతో ఉద్వేగభరితంగా ఉంటుంది. తమ జాతి గొప్పతనానికి గుర్తుగా ఆమె పార్లమెంటులో తన చోటులో నిలుచునే హకాను ప్రదర్శించారు. ఆ సమయంలో ఆమ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గామారింది. ఆమె పాట పాడుతున్న సమయంలో తన జాతికే చెందిన ఎంపీలు కొందరు ఆమెతో శృతి కలపగా.. మరికొందరు నవ్వుతూ ఆ ప్రదర్శనను ఆస్వాదించారు.
అనంతరం తమ జాతి ప్రజలను ఉద్దేశిస్తూ.. నేను మీ కోసం చావుకైనా సిద్ధం. అలాగా మీ కోసమే బతికేందుకూ సిద్ధం అని మైపీ క్లార్కె వ్యాఖ్యానించారు. తాను ఈ రోజు పార్లమెంటులో చేసిన ప్రదర్శనను, ప్రసంగాన్ని తమ జాతి బాలలకు అంకితమిస్తున్నానని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2002లో పుట్టిన మైపీ క్లార్కె మావోరీ పార్టీలో సభ్యురాలిగా ఉన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 1853లో 20 ఏళ్ల వయసులో ఎన్నికైన జేమ్స్ స్టువర్ట్ తర్వాత ఆ వయసులో ఎంపీ అయిన వ్యక్తి క్లార్కె మాత్రమే. ఈమె తాత ఎన్గా టమోటా అనే గిరిజన తెగకు చెందని యాక్టివిస్టు గ్రూప్‌లో సభ్యుడు.