శ‌వాల దిబ్బ‌గా అఫ్ఘ‌న్‌.. 4,000 దాటిన భూకంప మృతులు

  • Publish Date - October 10, 2023 / 08:20 AM IST
  • దాదాపు 2,000 ఇండ్లు నేల‌మ‌ట్టం
  • 4 రోజులుగా సాగుతున్నరెస్క్యూ చ‌ర్య‌లు


విధాత‌: భారీ భూకంపం ధాటికి పశ్చిమ అఫ్ఘనిస్తాన్ శ‌వాల దిబ్బ‌ను త‌ల‌పిస్తున్న‌ది. శనివారం సంభవించిన భూ ప్ర‌కంప‌న‌ల‌తో ఇప్ప‌టివ‌ర‌కు 4,000 మందికిపైగా మరణించిన‌ట్టు అధికారులు సోమవారం తెలిపారు. రిక్ట‌ర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాల కార‌ణంగా దాదాపు 2,000 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎన్‌డీఎంఏ) తెలిపింది.


“ఇప్పటి వరకు మాకు అందిన గణాంకాల ప్ర‌కారం మృతులు 4,000 మందికిపైగా ఉన్నారు. సుమారు 20 గ్రామాల్లో 1,980 నుంచి 2,000 ఇండ్లు పూర్తిగా నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి” అని ఏఎన్‌డీఎంఏ ప్రతినిధి ముల్లా సాయిక్ కాబూల్‌లో మీడియాకు వెల్ల‌డించారు.



 


శనివారం మధ్యాహ్నం హెరాత్ ప్రావిన్స్, స‌మీప ప్రాంతాల్లో రెండు భారీ భూకంపాలు వ‌చ్చిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. నాటి నుంచి వివిధ సంస్థలకు చెందిన 35 రెస్క్యూ టీమ్‌లలో 1,000 మందికి పైగా స‌హాయ‌కులు ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ చర్యలు చేపడుతున్నారని వెల్ల‌డించారు.


ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ హసన్ అఖుంద్, హెరాత్ ప్రావిన్స్‌లోని ప్రభావిత ప్రాంతాన్ని సోమవారం సందర్శించడానికి అధికారుల బృందానికి నాయకత్వం వహించారు. చైనా ఆదివారం ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్‌కు 200,000 US డాలర్ల నగదును దాని సహాయ మరియు విపత్తు సహాయ చర్యలకు అత్యవసర మానవతా సహాయంగా అందించింది.