అమెజాన్ ఉద్యోగుల‌కు ఏఐ గండం.. అలెక్సా విభాగంలో భారీగా లేఆఫ్‌లు

కృత్రిమ మేధ (AI) వ‌ల్ల ఉద్యోగాలు పోతాయ‌ని చాలా మందిలో భ‌యాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ భ‌యాలు నిజ‌మే అని అనుకునేలా భారీ లేఆఫ్‌ (Huge Lay Off)ల ప్ర‌క‌ట‌న‌లు పెద్ద పెద్ద సంస్థ‌ల నుంచి వ‌స్తున్నాయి

  • Publish Date - November 18, 2023 / 09:50 AM IST

విధాత‌: కృత్రిమ మేధ (AI) వ‌ల్ల ఉద్యోగాలు పోతాయ‌ని చాలా మందిలో భ‌యాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ భ‌యాలు నిజ‌మే అని అనుకునేలా భారీ లేఆఫ్‌ (Huge Lay Off)ల ప్ర‌క‌ట‌న‌లు పెద్ద పెద్ద సంస్థ‌ల నుంచి వ‌స్తున్నాయి. తాజాగా అమెజాన్ (Amazon) సంస్థ వెలువ‌రించిన ఓ లేఆఫ్ ప్ర‌క‌ట‌న‌.. ఏఐ గురించి భ‌య‌ప‌డుతున్న‌వారిని ఉలిక్కిప‌డేలా చేసింది. త‌మ ఉత్ప‌త్తి అయిన అలెక్సా వాయిస్ అసిస్టెంట్ (Alexa Voice Assistant) విభాగం నుంచి కొంత‌మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నామ‌ని అమెజాన్ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. త‌మ వ్యాపార ప్రాధాన్యాల్లో వ‌చ్చిన మార్పు, కృత్రిమ మేధ‌ను ఎక్కువ‌గా వినియోగించాల‌ని నిర్ణ‌యించ‌డ‌మే ఈ నిర్ణ‌యానికి కార‌ణ‌మ‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కింది.


దీని వ‌ల్ల సుమారు వంద‌ల మంది ఉద్యోగులు ప్ర‌భావితం కానున్నార‌ని తెలుస్తోంది. ఎంత మందిని తొల‌గించార‌నే విష‌యాన్ని అమెజాన్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో.. వారి సంఖ్య ఎక్కువ‌గా ఉండి ఉంటుంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. అలెక్సా వినియోగదారుల సంతృప్తిని పెంచే క్ర‌మంలో ఏఐ వైపు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాం. దీని వ‌ల్ల బిజినెస్ ప్ర‌ధాన్యాలు మారాయి. అని అలెక్సా అండ్ ఫైర్ టీవీ వైస్ ప్రెసిడెంట్ డానియ‌ల్ రౌచ్ వెల్ల‌డించారు. అయితే వివిధ విభాగాల నుంచి త‌మ కార్య‌క‌లాపాల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు అమెజాన్ గ‌త వారం రోజులుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది. వాటిలో మ్యూజిక్‌, గేమింగ్ స‌హా వివిధ మాన‌వ వ‌న‌రుల విభాగాలు కూడా ఉన్నాయి.


నిజానికి అలెక్సా విభాగంలో ఉత్ప‌త్తి ప‌డిపోవ‌డంతో ఉద్యోగుల్లో ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తింద‌ని గ‌త నెల‌లోనే రాయిట‌ర్స్ ఒక క‌థ‌నం వెలువ‌రించింది. అలెక్సాను ప్రారంభించి ఒక ద‌శాబ్దం దాట‌డం.. ప్ర‌స్తుత ట్రెండ్‌కు త‌గిన‌ట్లు దాని ప‌నితీరు లేద‌ని మార్కెట్‌లో ఒక అభిప్రాయం ఉంది. ముఖ్యంగా కృత్రిమ మేధ‌ను అలెక్సాకు వ‌ర్తింప‌జేయ‌డంలో అమెజాన్ బాగా వెన‌క‌బ‌డింద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆ రంగంలో పెట్టుబ‌డులు, రీసెర్చ్ పెంచ‌డానికి ఉద్యోగుల‌పై వేటు వేసిన‌ట్లు తెలుస్తోంది.


మ‌రోవైపు వినియోగ‌దారునికి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ సేవ‌లు అందించేందుకు అంటూ చాలా బ‌డా సంస్థ‌లు ఉద్యోగుల‌ను తొల‌గించి ఆ ఆర్థిక వ‌న‌రుల‌ను ఏఐ అభివృద్ధికి వెచ్చిస్తున్నాయి. ఏఐ సాయంతో మ‌నుషుల అవ‌స‌రం లేకుండానే పెద్ద పెద్ద కోడింగ్‌ల‌ను రాసేయ‌చ్చు. చిన్న చిన్న ప్రాంప్ట్‌ల సాయంతో సుదీర్ఘ‌మైన స్పంద‌న‌ల‌ను జ‌న‌రేట్ చేయ‌డం చాలా సులువు. స్పంద‌న‌ల‌ను సృష్టించే అవ‌కాశ‌మూ ఉంటుంది.

Latest News