Site icon vidhaatha

Waker-Uz-Zaman | బంగ్లా పగ్గాలు స్వీకరించిన ఆర్మీ చీఫ్‌.. ఎవరీ వాకెర్‌ ఉజ్‌ జమాన్‌? ఆయన తండ్రి ఎవరో తెలిస్తే..

ఢాకా : బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి పదవికి షేక్‌ హసీనా రాజీనామా అనంతరం దేశ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు ఆర్మీ చీఫ్‌ వాకెర్‌ ఉజ్‌ జమాన్‌. పొరుగుదేశంలో చోటు చేసుకున్న పరిణామం భారత్‌లోనూ తీవ్ర ఆసక్తి రేపింది. అందులో భాగంగానే అసలు ఎవరీ జమాన్‌ అనే ఉత్సుకత కూడా నెలకొన్నది. ఏడాది జూన్‌లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జమాన్‌.. ఫోర్‌స్టార్‌ జనరల్‌.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఆయన తండ్రి ముస్తాఫిజుర్‌ రహమాన్‌ కూడా బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌గా 1997 డిసెంబర్‌ 24 నుంచి 2000, డిసెంబర్‌ 23 వరకూ పనిచేశారు. అంతేకాదు.. షేక్‌ హసీనా కుటుంబంతో కూడా ఆయనకు బంధుత్వం ఉన్నది. జమాన్‌ భార్య హసీనా కజిన్‌ అని వీకీపీడియా పేర్కొంటున్నది. 58 ఏళ్ల జమాన్‌.. 1985లో ఆర్మీలో చేరారు. అంతకు ముందు ఆయన బంగ్లాదేశ్‌ మిలిటరీ అకాడమీలో విద్యాభ్యాసం చేశారు. 1985 డిసెంబర్‌ 20న కార్ప్స్‌ ఆఫ్‌ ఇన్‌ఫాంట్రీలో చేరారు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన సైన్యంలో సేవలందిస్తున్నారు. షేక్‌ హసీనా ప్రభుత్వంలో ఆమె ప్రిన్సిపల్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. బంగ్లా మిలిటరీ ఆధునీకరణకు ఎంతగానో కృషి చేశారు.

Exit mobile version