Ferris wheel : అక్కడ ఓ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతా కలిసి ఆ ఫెస్టివల్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సందర్శకుల కేరింతలు, ఆనందోత్సాహల నడుమ మ్యూజిక్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. సరిగ్గా అప్పుడే అక్కడ ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. ఆ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ తిరుగుతూనే మంటల్లో చిక్కుకుంది. జర్మనీలో జరిగిన ఈ ఘటనలో మొత్తం 30 మందికి గాయాలయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జర్మనీలోని లైప్‌సిగ్ నగరంలో స్టార్మ్‌థాలర్ సరస్సు ఒడ్డున సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ తిరుగుతున్న సమయంలో ముందుగా దానిలోని ఓ టబ్‌కు మంటలు అంటుకున్నాయి. అది గాల్లో తిరుగుతుండగా పక్కనున్న టబ్‌లకు మంటలు వ్యాపించాయి. దాంతో జాయింట్ వీల్ తిరుగుతున్న సర్కిల్‌లో దట్టమైన పొగ కమ్మింది.
ఈ అనూహ్య పరిణామంతో వీల్‌లో ఉన్న సందర్శకులు హాహాకారాలు చేశారు. కింద ఉండి వారిని చూస్తున్న సందర్శకులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు జాయింట్ వీల్ తిరగకుండా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించారు. అప్పటికే దట్టమైన పొగ అలుముకోవడంతో నలుగురు పోలీస్ అధికారులతోపాటు మొత్తం 30 మంది అస్వస్థతకు గురయ్యారు.
వారిలో ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగానే వీల్‌లో మంటలు చెలరేగాయని నిర్వాహకులు చెప్పారు.